అందుకే ‘బుడ్డోడు...’ డైలాగ్ రాశాను
అందుకే ‘బుడ్డోడు...’ డైలాగ్ రాశాను
Published Thu, Oct 10 2013 2:09 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
‘‘నేను ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నానని తెలియగానే చాలామంది ‘బుడ్డోడితో సినిమా చేస్తున్నావట’ అంటూ మెసేజ్‌లు పంపించారు. బుడ్డోడు అని అభిమానంగా అన్నప్పటికీ, అదే పదంతో లెక్కలేనన్ని మెసేజ్‌లు రావడంతో అసహనానికి గురయ్యాను. ఆ అసహనం నుంచి పుట్టినదే ‘బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి తంతా..’ అనే డైలాగ్ వచ్చింది. అంతే తప్ప ఇది కావాలని ఎవర్నీ ఉద్దేశించి పెట్టింది కాదు’’ అన్నారు హరీష్‌శంకర్.
ఎన్టీఆర్, సమంత జంటగా శ్రుతిహాసన్ ప్రత్యేక పాత్రలో రూపొందిన చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’. హరీష్‌శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హరీష్‌శంకర్ పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘భీముడు పట్టాల్సిన గదను రాముడు పట్టాడు. ఎందుకు పట్టాడు? అనేది సినిమాలో చూడాల్సిందే. ఎన్టీఆర్‌ని యూత్‌ఫుల్‌గా చూపించాలనుకున్నాను. అందుకే ఇందులో ఆయనతో కాలేజ్ స్టూడెంట్ పాత్ర చేయించాను.
అయితే కాలేజ్ సీన్స్ మాత్రం ఉండవు. లుక్‌పరంగా ఎన్టీఆర్ తగిన కేర్ తీసుకోవడంవల్ల చాలా బాగున్నారు. డాన్స్, ఫైట్స్, డైలాగ్స్.. దేన్నయినా సింగిల్ టేక్‌లో చేయగల సత్తా ఉన్న హీరో ఎన్టీఆర్. ఆయన సమంత కాంబినేషన్‌లో వచ్చే టీజింగ్ సీన్స్ చాలా అలరిస్తాయి. ఇప్పటివరకు ఎన్టీఆర్ ఇలాంటి సన్నివేశాల్లో నటించలేదు. జనరల్‌గా నా సినిమా హీరోని నేను బాగా ఆరాధిస్తాను. తనని దృష్టిలో పెట్టుకునే సినిమా మొత్తం ప్లాన్ చేశాను. కథానాయిక పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు. కానీ, ఈ చిత్రంలో సమంత, శ్రుతిహాసన్‌ల పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. సినిమాను కీలక మలుపు తిప్పే పాత్రలివి. తమన్ ఇచ్చిన పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
సినిమా కూడా ఘనవిజయం సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఈ సమయంలో సినిమా విడుదల చేయడం ద్వారా ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందనుకుంటున్నారు? అనే ప్రశ్నకు -‘‘నాకు రాష్ర్ట రాజకీయాల మీద అవగాహన లేదు. సినిమా పరిశ్రమలో ఉన్న 24 శాఖలను నమ్ముతాను. నిర్మాతకు చెప్పిన ప్రకారం సినిమాని తీయడం నా బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాను. మంచి ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులకు అందిస్తున్నాం’’ అని చెప్పారు హరీష్ శంకర్.
Advertisement