‘ఇది నా లవ్ స్టోరి’ చిత్రంలో తరుణ్
టైటిల్ : ఇది నా లవ్ స్టోరి
జానర్ : రొమాంటిక్ ఎంటర్‌టైనర్
తారాగణం : తరుణ్, ఓవియా
సంగీతం : శ్రీనాథ్ విజయ్
దర్శకత్వం : రమేష్, గోపి
నిర్మాత : ఎస్వీ ప్రకాష్
ఒకప్పుడు లవర్ బాయ్‌గా ఓ వెలుగు వెలిగిన తరుణ్, తరువాత వరుస ఫ్లాప్‌లు ఎదురవ్వటంతో కష్టాల్లో పడ్డాడు. దాదాపుగా ఇక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశాడనుకుంటున్న సమయంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఇది నా లవ్ స్టోరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడలో ఘనవిజయం సాధించిన సింపుల్లాగ్ ఒంద్ లవ్ స్టోరి ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రమేష్ గోపిలు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తన ఇమేజ్‌కు తగ్గట్టుగా లవర్ బాయ్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు తరుణ్. మరి లాంగ్ గ్యాప్ తరువాత తరుణ్ చేసిన ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? ఇది నా లవ్ స్టోరి అయినా తరుణ్‌ను హిట్ ట్రాక్‌లోకి తీసుకువచ్చిందా..?
కథ :
అభిరామ్ (తరుణ్) యాడ్ ఫిలిం డైరెక్టర్. తల్లిదండ్రులు లేని అభిరామ్‌కు చెల్లెలంటే ప్రాణం. అందుకే చెల్లి ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అభిరామ్ చెల్లి.. తనకు కాబోయే మరదలిని తన అన్న పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వాళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తుంది. చెల్లెలి మాట కాదనలేక అభిరామ్.. డాక్టర్ శృతిని చూసేందుకు ఒప్పుకుంటాడు. వెళ్లేదారిలో ఓ అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తీరా తనే శృతి (ఓవియా) అని తెలిసి ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఇంట్లో వాళ్లంతా గుడికి వెళ్లారని రావడానికి చాలా సమయం పడుతుందని శృతి చెప్పటంతో ఈ లోగా ఒకరి ఇష్టాఇష్టాలను ఇంకొకరు తెలుసుకోవచ్చిన గతం గురించి మాట్లాడుకోవటం మొదలపెడతారు. ఇద్దరు తమ తొలి ప్రేమకథలను పంచుకుంటారు. అదే సమయంలో శృతి కూడా అభిరామ్‌తో ప్రేమలో పడుతుంది. మరుసటి రోజు ఉదయం లేచేసరికి పోలీసులు అభిరామ్‌ను అరెస్ట్ చేస్తారు. శృతి కంప్లయిట్ ఇచ్చినందుకే తనని అరెస్ట్ చేశారని తెలిసి షాక్ అవుతాడు అభిరామ్. అసలు శృతి అలా ఎందుకు కంప్లయింట్ ఇచ్చింది..? ఆమె నిజంగా శృతినేనా..? చివరకు అభిరామ్‌కు తను ప్రేమించిన అమ్మాయి దక్కిందా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
చాలా కాలం తరువాత తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చిన తరుణ్, లవర్ బాయ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. కథా కథనాల పరంగా పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్ లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో తరుణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్‌గా నటించిన ఓవియా పరవాలేదనిపించింది. బిగ్‌బాస్ వివాదాలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ గ్లామర్‌తో ఆకట్టుకున్నా.. నటన పరంగా నిరాశపరిచింది. అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడే హీరో చెల్లెలి పాత్ర తప్ప సినిమాలో మరే క్యారెక్టర్‌కు పెద్దగా ఇంపార్టెన్స్‌లేదు.
విశ్లేషణ :
కన్నడలో విజయం సాధించిన రొమాంటిక్ కామెడీని తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించటంలో దర్శకులు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కథలో మంచి ఎమోషన్ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు అలాంటి వాటిమీద ఏమాత్రం దృష్టి పెట్టలేదు. రెండు గంటల సినిమాలో ఒక్క సీన్‌ను కూడా ఆసక్తికరంగా రూపొందించలేకపోయారు. సినిమాకు మరో మేజర్ డ్రాబ్యాక్ డైలాగ్స్. అవసరం లేకపోయినా ఇరికించిన పంచ్ డైలాగ్, ఏ మాత్రం పేలకపోగా చాలా సందర్భాల్లో విసుగుతెప్పిస్తాయి. శ్రీనాథ్ విజయ్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ప్రీ క్లైమాక్స్‌లో తరుణ్ నటన
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
కథా కథనం
డైలాగ్స్
సంగీతం
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment