రియల్ స్టార్ వస్తున్నాడు!
నటుడిగా విభిన్న తరహా పాత్రలు పోషించి, ‘రియల్ స్టార్’ అనిపించుకున్నారు శ్రీహరి. ఆయన హీరోగా నటించిన ‘టీ సమోసా బిస్కెట్’ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమా టైటిల్‌ని ‘రియల్ స్టార్’ అని మార్చారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాతలు కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు తెలియజేశారు. ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హంసా నందిని కథానాయికగా నటించారు.
ఈ నెలలోనే పాటలను, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. శ్రీహరి నటించిన చివరి సినిమా ఇదని, ఆయన నిజజీవితానికి దగ్గరగా ఉంటుందనే ‘రియల్ స్టార్’ అని టైటిల్ పెట్టామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ: ఎస్. బాబ్జీ, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్.