Real Star
-
సలాం నమస్తే హైదరబాద్... ఇరాని హోటల్ జిందాబాద్
పాటతత్వం ‘‘కాఫీడేలు, కాఫీబారుల రాకతో హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన ఇరాని హోటళ్ల వైభవం తగ్గుతోందిప్పుడు. ఆ హోటళ్లలో మత సామరస్యం, మంచి చెడు, సరదా సంగతుల గురించి వివరించే పాట ఇది’’ అన్నారు పాటల రచయిత కాసర్ల శ్యామ్. శ్రీహరి హీరోగా నటించిన ‘రియల్‌స్టార్’ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ స్వరకల్పనలో శ్యామ్ రాసిన ‘సలాం నమస్తే హైదరబాద్.. ఇరాని హోటల్ జిందాబాద్’ పాటతత్వం గురించి రచయిత మాటల్లో... చనుబాలు లేక చంటి పోరడు చప్పరించేది చాయ్ బొట్టు బ్రెడ్డు జాము లేని పేద ఇంట డబల్ రొట్టెనే బ్రేక్ ఫాస్ట్... హోటల్ మెట్ల మీద ఓ బిచ్చగత్తె కూర్చుంటుంది. ఏడుస్తున్న పిల్లాడికి పాలు ఇద్దామంటే రావు. అప్పుడు ఓ గ్లాస్లో చాయ్ తెప్పించి పిల్లాడికి పడుతుంది. సినిమాలో పాట అక్కడ్నుంచి ప్రారంభమవుతుంది. పాలుకు డబ్బులు లేక చాయ్, బ్రేక్‌ఫాస్ట్‌కి బదులు ఆ చాయ్‌లో బ్రెడ్ ముంచుకుని తినడం అలవాటు చేసిన పేద కుటుంబాలు మనకు చాలా తారసపడతాయి. ఆదాబ్ అంటడు ఆచారి/ నమస్తే అంటడు నజీరు భాయ్/తీసుకుంటారు అలాయ్ భళాయ్/ ఆర్డరిచ్చి వన్ బై టూ చాయ్ / అందరు ఇక్కడ ఒకటేనయ్యా.. అందరి అడ్డా ఇదేర భయ్యా వన్ బై టూ చాయ్ చెప్పి.. ఓ ముస్లిమ్, ఓ హిందూ కలసి తాగుతారు. సర్వమత జనులు ఇక్కడ స్నేహితులవుతారు. అందరూ ఒక్కటే అని చెప్పడమే ఈ పల్లవి ఉద్దేశం. రెక్కలు ముక్కలు చేసుకునే శ్రమజీవులకు ఇది మజిలీ చెమట చుక్కలను సేదదీర్చుటకె ఇక్కడి పంఖా గాలి నిమిషమైన తన కష్టం మరిచి కూర్చోవాలనే కూలీ ఒడిని పంచుటకె వేచి ఉన్నది అబ్ తక్ కుర్సీ ఖాళీ గుప్పు గుప్పుమని పొగలు గక్కె టీ కప్పు తనను చూడాలని ఎప్పుడేప్పుడని ఎదురుచూసే పేదోడి పెదవి తాకాలని రిక్షావాడి మాడిన పేగుని వేడితో చల్లార్చాలని శ్రీహరిగారు చెప్పి మరీ రాయించుకున్న చరణమిది. రిక్షావాడి కడుపులో పేగులు మాడుతుంటే.. ఆ ఆకలిని తీర్చి వేడి వేడి టీ చల్లారుస్తుందని చెప్పాను. ఆ చాయ్ పేదోడికి పరమాణ్ణం. గల్లీ గ్యాంగ్‌కు టైంపాసు ఇది నిరుద్యోగులకు ఆఫీసు చుట్టుపక్కల బస్తీలకు ఈ కేఫె కేరాఫ్ అడ్రస్సు కలిసే దోస్తులు దొర్లే నవ్వులు బిల్లు కొరకు కొట్లాటలు సిగరెట్ పొగలు భగ్న ప్రేమికులు దొరుకు అప్పు ఓదార్పులు గంటల తరబడి కూర్చున్నా నిను ఆదరించేటి హోటళ్ళు బిడ్డల ఆకలి అడిగిన వెంటనే తీర్చే అమ్మల లోగిళ్ళు ప్రపంచమంతా పరిచయమయ్యే గ్రంథాలయమే ఈ హోటల్ బిల్ నేను కడతానంటే, నేనంటూ స్నేహితులు సరదాగా కొట్టుకుంటారు. అక్కడే అప్పు అడుగుతారు, ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఓదారుస్తారు. ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాల గురించి చర్చిస్తారు. పక్కన చాయ్ తాగుతుంటే వినపడిన ఆ మాటలు మనకు గుర్తుండిపోతాయి. అందుకే గ్రంథాలయంతో పోల్చాను. కాఫీబారు కలలో రాని కష్టజీవికిది తాజ్ మహల్ అధికారం దరిదాపులో లేని సామాన్యునికిది అసెంబ్లి హాల్ రాజు పేద ఉందా లేదా అడగదు మనను జాతి మతాల్ వచ్చే పోయే పాత్రలు ఎన్నో రంగస్థలమే ఈ హోటల్ పొట్టకూటికై పొద్దుమాపు గిర గిర గిర గిర తిరిగే ఈ నగరం గూటికి చేరిన పక్షిలాగ గుమిగూడుతదిక్కడ సాయంత్రం హోటల్ కాదిది ఒకటిగ వెలిసిన చర్చి మసీదు మందిరం కాఫీ డేలు, చాక్లెట్ రూమ్‌లు అవన్నీ సగటుజీవి తాహతుకు సంబంధించినవి కాదు. అదంతా పేజ్ 3 కల్చర్. అలాంటివాడికి ఈ హోటల్ అపురూపమైన తాజ్ మహల్. ఇరాని హోటళ్లల్లో మన కులమతాలు అడగరు. కాలినడకన, బైక్ మీద, కారులో.. హోటల్‌కి వచ్చే అందర్నీ ఆహ్వానిస్తారు. హోటల్ ఓ స్టేజి, ఎప్పుడూ అక్కడే ఉంటుంది. కస్టమర్లు వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్లందరూ ఆ స్టేజి మీద నాటకం వేసే పాత్రధారులే. ఓ రోజంతా హోటల్లో కూర్చుని గమనిస్తే, ప్రపంచమనే నాటకం మన కళ్ల ముందు కదలాడుతుంది. మార్నింగ్ ఓ టీ తాగి ఉద్యోగానికి వెళ్లిన వారు, గూటికి చేరిన పక్షుల్లాగా సాయంత్రం మళ్లీ వాలతారు. పల్లవిలో చెప్పిన విషయాన్ని చివర్లో ‘హోటల్ కాదిది చర్చి మసీదు మందిరం’ అని చివర్లో మళ్లీ చెప్పాను. జాబ్ శాటిస్ఫాక్షన్ కోసం రాసే పాటలు కొన్ని, జేబు శాటిస్ఫాక్షన్ కోసం రాసే పాటలు కొన్ని ఉంటాయి. నాకు జాబ్ శాటిస్ఫాక్షన్ ఎక్కువ ఇచ్చిన పాటల్లో ‘సలాం నమస్తే..’ పాట అగ్రస్థానంలో ఉంటుంది. శ్రీహరి గారు తమ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ పాట వినిపించేవారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్నగారు పాట విన్న తర్వాత.. ‘‘పల్లే పాట రాయడానికి నా పాటలను ఎలా రిఫరెన్స్‌గా తీసుకుంటారో ఇరాని హోటల్, చాయ్ గురించి రాయడానికి ఈ పాట రిఫరెన్స్‌గా తీసుకుంటారు’’ అని చెప్పిన మాటలు నా జీవితాంతం గుర్తుంటాయి. బతకడానికి రాసిన పాటలు చాలా ఉన్నాయి. రచయితగా నన్ను బతికించిన పాట ఇది. ఇంటర్వ్యూ: సత్య పులగం - కాసర్ల శ్యామ్, గీత రచయిత -
రియల్ స్టార్
-
రియల్‌స్టార్ శ్రీహరి విగ్రహావిష్కరణ
అంబాజీపేట : సామాజిక సేవతోపాటు రియల్ స్టార్‌గా పేరొందిన దివంగత సినీనటుడు ఆర్.శ్రీహరి విగ్రహాన్ని గురువారం అభిమానులు ఆవిష్కరించారు. అంబాజీపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ఎదురుగా కాపు యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం కన్నబాబు మాట్లాడుతూ శ్రీహరి సినీ నటునిగానే కాకుండా సామాజిక సేవలోనూ ముందున్నారని కొనియాడారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘ జిల్లా అధ్యక్షుడు యేడిద శ్రీను, కల్వకొలను తాతాజీ, గణపతి బాబులు, పత్తి దత్తుడు, గణపతి వీరరాఘవులు, సుంకర బాలాజీ, నూకల గౌరీష్, కొర్లపాటి వెంకటేశ్వరరావు, సూదాబత్తుల రాము, గొల్లపల్లి బాబి, దాసం బాబి, సలాది స్వామి, పత్తి దత్తుడు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నిజమైన నాయకుడు!
హీరోగా విలక్షణమైన పాత్రలు చేసి, జీవితంలో కూడా పదిమందికి సహాయం చేసి, హీరో అనిపించుకున్నారు స్వర్గీయ శ్రీహరి. అందుకే ఆయన్ను ‘రియల్‌స్టార్’ అంటారు. అదే టైటిల్‌తో శ్రీహరి హీరోగా రూపొందిన ఆ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. తమ్మారెడ్డి భరద్వాజ్ కీలక పాత్ర చేయగా, హంసానందిని కథానాయికగా నటించారు. సి.రామచంద్రయ్య సమర్పణలో ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు నిర్మించారు. శ్రీహరి అభినయం హైలైట్‌గా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాణ సారథి: ఉగ్గిరాల సీతారామయ్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పెద్దిరాజు, సహనిర్మాతలు: కె.వై. గిరిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్. -
కిక్ ఇచ్చే పాత్ర!
ఈ మధ్యకాలంలో ప్రత్యేక పాటలకు, అతిథి పాత్రలకు పరిమితమైన హంసా నందిని ‘రియల్ స్టార్’లో కథానాయికగా నటించారు. స్వర్గీయ శ్రీహరి టైటిల్ రోల్లో సి. రామచంద్రయ్య సమర్పణలో ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కీలక పాత్ర చేశారు. ఈ నెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘నిజజీవితంలో శ్రీహరి అందరివాడు అనిపించుకున్నారు. అందుకే ‘అందరివాడు’ అనేది ఈ చిత్రాన్ని ట్యాగ్‌లైన్‌గా పెట్టాం. హంసా నందిని పాత్ర కిక్ ఇచ్చే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పెద్దిరాజు, సహనిర్మాతలు: కె.వై.గిరిరాజ్, పులగం శ్రీనివాస్ ముదిరాజ్. -
‘రియల్ స్టార్’మూవీ స్టిల్స్
-
ఘనంగా ఉపేంద్ర పుట్టిన రోజు వేడుక
-
శ్రీహరి పుట్టినరోజుకి...
శ్రీహరి టైటిల్ రోల్లో, హంసానందిని నాయికగా నటించిన చిత్రం ‘రియల్ స్టార్’. చిగురుపాటి రామచంద్రయ్య సమర్పణలో ర్యాలి శ్రీనివాసరావును దర్శకునిగా పరిచయం చేస్తూ కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. వందేమాతరం శ్రీనివాస్ స్వరపరచిన పాటలను ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించి, తొలి సీడీని నిర్మాత సి. కల్యాణ్‌కు అందించారు. శ్రీహరి పట్టుబట్టి ఇందులో తనతో ఓ ముఖ్య పాత్ర చేయించారనీ, తమ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని భరద్వాజ్ అన్నారు. వెండితెరపైనే కాదు.. నిజజీవితంలోనూ హీరో అనిపించుకున్న శ్రీహరి నటించిన ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కావడం ఆనందంగా ఉందని శ్రీనివాసరావు చెప్పారు. శ్రీహరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ ఆడియో వేడుకలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కొడాలి వెంకటేశ్వరరావు, అమ్రిష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకొనే హంసానందిని
దివంగత శ్రీహరి కథానాయకునిగా రూపొందిన ‘రియల్‌స్టార్’లో హంసానందిని నాయిక పాత్ర చేశారు. ర్యాలి శ్రీనివాసరావు దర్శకుడు. కొండపల్లి యోగానంద్, కె.లక్ష్మణరావు నిర్మాతలు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శ్రీహరికి ఘనమైన నివాళి ఈ సినిమా. ఇందులో హంసానందిని, శ్రీహరి కాంబినేషన్ మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరాలకు శ్రీహరి, హంసానందిని వేసిన స్టెప్పులు సినిమాకే ప్రత్యేక ఆకర్షణ’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: డా.సి.రామచంద్రయ్య. -
రియల్ స్టార్ వస్తున్నాడు!
నటుడిగా విభిన్న తరహా పాత్రలు పోషించి, ‘రియల్ స్టార్’ అనిపించుకున్నారు శ్రీహరి. ఆయన హీరోగా నటించిన ‘టీ సమోసా బిస్కెట్’ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమా టైటిల్‌ని ‘రియల్ స్టార్’ అని మార్చారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాతలు కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు తెలియజేశారు. ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హంసా నందిని కథానాయికగా నటించారు. ఈ నెలలోనే పాటలను, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. శ్రీహరి నటించిన చివరి సినిమా ఇదని, ఆయన నిజజీవితానికి దగ్గరగా ఉంటుందనే ‘రియల్ స్టార్’ అని టైటిల్ పెట్టామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ: ఎస్. బాబ్జీ, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్.