సలాం నమస్తే హైదరబాద్... ఇరాని హోటల్ జిందాబాద్ | Salam Namaste Hyderabad ... Irani Hotel Zindabad song | Sakshi
Sakshi News home page

సలాం నమస్తే హైదరబాద్... ఇరాని హోటల్ జిందాబాద్

Published Sun, Sep 11 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

సలాం నమస్తే హైదరబాద్... ఇరాని హోటల్ జిందాబాద్

సలాం నమస్తే హైదరబాద్... ఇరాని హోటల్ జిందాబాద్

పాటతత్వం
‘‘కాఫీడేలు, కాఫీబారుల రాకతో  హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన ఇరాని హోటళ్ల వైభవం తగ్గుతోందిప్పుడు. ఆ హోటళ్లలో మత సామరస్యం, మంచి చెడు, సరదా సంగతుల గురించి వివరించే పాట ఇది’’ అన్నారు పాటల రచయిత కాసర్ల శ్యామ్. శ్రీహరి హీరోగా నటించిన ‘రియల్‌స్టార్’ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ స్వరకల్పనలో శ్యామ్ రాసిన ‘సలాం నమస్తే హైదరబాద్.. ఇరాని హోటల్ జిందాబాద్’ పాటతత్వం గురించి రచయిత మాటల్లో...
 
చనుబాలు లేక చంటి పోరడు చప్పరించేది చాయ్ బొట్టు
 బ్రెడ్డు జాము లేని పేద ఇంట డబల్ రొట్టెనే బ్రేక్ ఫాస్ట్...
 హోటల్ మెట్ల మీద ఓ బిచ్చగత్తె కూర్చుంటుంది. ఏడుస్తున్న పిల్లాడికి పాలు ఇద్దామంటే రావు. అప్పుడు ఓ గ్లాస్‌లో చాయ్ తెప్పించి పిల్లాడికి పడుతుంది. సినిమాలో పాట అక్కడ్నుంచి ప్రారంభమవుతుంది. పాలుకు డబ్బులు లేక చాయ్, బ్రేక్‌ఫాస్ట్‌కి బదులు ఆ చాయ్‌లో బ్రెడ్ ముంచుకుని తినడం అలవాటు చేసిన పేద కుటుంబాలు మనకు చాలా తారసపడతాయి.
 
ఆదాబ్ అంటడు ఆచారి/ నమస్తే అంటడు నజీరు భాయ్/తీసుకుంటారు అలాయ్ భళాయ్/ ఆర్డరిచ్చి వన్ బై టూ చాయ్ / అందరు ఇక్కడ ఒకటేనయ్యా.. అందరి అడ్డా ఇదేర భయ్యా
  వన్ బై టూ చాయ్ చెప్పి.. ఓ ముస్లిమ్, ఓ హిందూ కలసి తాగుతారు. సర్వమత జనులు ఇక్కడ స్నేహితులవుతారు. అందరూ ఒక్కటే అని చెప్పడమే ఈ పల్లవి ఉద్దేశం.
 రెక్కలు ముక్కలు చేసుకునే శ్రమజీవులకు ఇది మజిలీ
 చెమట చుక్కలను సేదదీర్చుటకె ఇక్కడి పంఖా గాలి
 నిమిషమైన తన కష్టం మరిచి కూర్చోవాలనే కూలీ
 ఒడిని పంచుటకె  వేచి ఉన్నది అబ్ తక్ కుర్సీ ఖాళీ
 గుప్పు గుప్పుమని పొగలు గక్కె టీ కప్పు తనను చూడాలని
 
ఎప్పుడేప్పుడని ఎదురుచూసే పేదోడి పెదవి తాకాలని
 రిక్షావాడి మాడిన పేగుని వేడితో చల్లార్చాలని
 శ్రీహరిగారు చెప్పి మరీ రాయించుకున్న చరణమిది. రిక్షావాడి కడుపులో పేగులు మాడుతుంటే.. ఆ ఆకలిని తీర్చి వేడి వేడి టీ చల్లారుస్తుందని చెప్పాను. ఆ చాయ్ పేదోడికి పరమాణ్ణం.
 గల్లీ గ్యాంగ్‌కు టైంపాసు ఇది నిరుద్యోగులకు ఆఫీసు
 చుట్టుపక్కల బస్తీలకు ఈ కేఫె కేరాఫ్ అడ్రస్సు
 కలిసే దోస్తులు దొర్లే నవ్వులు బిల్లు కొరకు కొట్లాటలు
 సిగరెట్ పొగలు భగ్న ప్రేమికులు దొరుకు అప్పు ఓదార్పులు
 గంటల తరబడి కూర్చున్నా నిను ఆదరించేటి హోటళ్ళు
 బిడ్డల ఆకలి అడిగిన వెంటనే తీర్చే అమ్మల లోగిళ్ళు
 ప్రపంచమంతా పరిచయమయ్యే గ్రంథాలయమే ఈ హోటల్
 
బిల్ నేను కడతానంటే, నేనంటూ స్నేహితులు సరదాగా కొట్టుకుంటారు. అక్కడే అప్పు అడుగుతారు, ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఓదారుస్తారు. ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాల గురించి చర్చిస్తారు. పక్కన చాయ్ తాగుతుంటే వినపడిన ఆ మాటలు మనకు గుర్తుండిపోతాయి. అందుకే గ్రంథాలయంతో పోల్చాను.
 కాఫీబారు కలలో రాని కష్టజీవికిది తాజ్ మహల్
 అధికారం దరిదాపులో లేని సామాన్యునికిది అసెంబ్లి హాల్
 రాజు పేద ఉందా లేదా అడగదు మనను జాతి మతాల్
 వచ్చే పోయే పాత్రలు ఎన్నో రంగస్థలమే ఈ హోటల్
 పొట్టకూటికై పొద్దుమాపు గిర గిర గిర గిర తిరిగే ఈ నగరం
 గూటికి చేరిన పక్షిలాగ గుమిగూడుతదిక్కడ సాయంత్రం
 హోటల్ కాదిది ఒకటిగ వెలిసిన చర్చి మసీదు మందిరం
 కాఫీ డేలు, చాక్లెట్ రూమ్‌లు అవన్నీ సగటుజీవి తాహతుకు సంబంధించినవి కాదు. అదంతా పేజ్ 3 కల్చర్. అలాంటివాడికి ఈ హోటల్ అపురూపమైన తాజ్ మహల్.
 
ఇరాని హోటళ్లల్లో మన కులమతాలు అడగరు. కాలినడకన, బైక్ మీద, కారులో.. హోటల్‌కి వచ్చే అందర్నీ ఆహ్వానిస్తారు. హోటల్ ఓ స్టేజి, ఎప్పుడూ అక్కడే ఉంటుంది. కస్టమర్లు వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్లందరూ ఆ స్టేజి మీద నాటకం వేసే పాత్రధారులే. ఓ రోజంతా హోటల్‌లో కూర్చుని గమనిస్తే, ప్రపంచమనే నాటకం మన కళ్ల ముందు కదలాడుతుంది. మార్నింగ్ ఓ టీ తాగి ఉద్యోగానికి వెళ్లిన వారు, గూటికి చేరిన పక్షుల్లాగా సాయంత్రం మళ్లీ వాలతారు. పల్లవిలో చెప్పిన విషయాన్ని చివర్లో ‘హోటల్ కాదిది చర్చి మసీదు మందిరం’ అని చివర్లో మళ్లీ చెప్పాను.  
 
జాబ్ శాటిస్‌ఫాక్షన్ కోసం రాసే పాటలు కొన్ని, జేబు శాటిస్‌ఫాక్షన్ కోసం రాసే పాటలు కొన్ని ఉంటాయి. నాకు జాబ్ శాటిస్‌ఫాక్షన్ ఎక్కువ ఇచ్చిన పాటల్లో ‘సలాం నమస్తే..’ పాట అగ్రస్థానంలో ఉంటుంది. శ్రీహరి గారు తమ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ పాట వినిపించేవారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్నగారు పాట విన్న తర్వాత.. ‘‘పల్లే పాట రాయడానికి నా పాటలను ఎలా రిఫరెన్స్‌గా తీసుకుంటారో ఇరాని హోటల్, చాయ్ గురించి రాయడానికి ఈ పాట రిఫరెన్స్‌గా తీసుకుంటారు’’ అని చెప్పిన మాటలు నా జీవితాంతం గుర్తుంటాయి. బతకడానికి రాసిన పాటలు చాలా ఉన్నాయి. రచయితగా నన్ను బతికించిన పాట ఇది.
ఇంటర్వ్యూ: సత్య పులగం
 - కాసర్ల శ్యామ్, గీత రచయిత

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement