తమిళ సినిమా: నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ నటి అన్న పదానికి చిరునామా ఆమె. తెలుగులో కథానాయికగా పలు చిత్రాల్లో నటించి జాతీయ అవార్డులను గెలుచుకున్న నటీమణి.. తెలుగుతోపాటు తమిళంలోనూ నటించిన ఆమె.. తమిళ నిర్మాత కాజామైదీన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత నటనకు దూరంగా ఉన్న ఆమని ఇటీవల మళ్లీ నటించడం మొదలెట్టారు. ఆమె భర్త కాజామైదీన్ రోజా కంబైన్స్ పతాకంపై చుట్టికుళందై, గోపాలా గోపాలా గొపాలా, పోర్కాలం, పూందోట్టం, వాంజినాథన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
ఇప్పుడు ఆమని మేనకోడలు, ఆమె సోదరుడి కుమార్తె హృతిక కథానాయికగా సినీ రంగంలోకి అడుగుపెడుతోంది. కరుప్పయ్య మురుగన్ దర్శకత్వంలో అశోక్ కథానాయకుడిగా నటిస్తున్న ‘విడయాద ఇరవొండ్రు వేండుం’ అనే చిత్రం ద్వారా ఆమె కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఎన్నో కలలు, ఆశలతో రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ.. ఆమనిని మించి మంచిపేరును చిత్రసీమలో తెచ్చుకోవాలని భావిస్తున్నట్టు తెలిపింది. ‘మా అత్త ఆమనికి నటిగా తెలుగులో మంచి పేరు ఉంది. ఆమె అవార్డులను సైతం గెలుపొందారు. అలాంటి అత్తను చూస్తూ పెరిగిన నేను నటనలో ఆమెలా పేరు తెచ్చుకోవాలన్నది చిన్నప్పటి నుంచే ఆశించా’ అని హృతిక తెలిపింది.
తన మామ కాజామైదీన్ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారని, పాఠశాల విద్యను పూర్తిచేసిన తరువాత సినిమాల్లోకి రమ్మని వారిద్దరూ తనకు సూచించారని, వారి ఆశీస్సులతో ఈ రంగంలోకి వచ్చానని పేర్కొంది. సినిమాల కోసం భరతనాట్యంతోపాటు డాన్స్‌ను నేర్చుకున్నానని చెప్పింది. తన పూర్వీకులు ఆంధ్రావారేనని, కానీ, పెరిగింది తమిళనాడులో, ప్రస్తుతం చదువుతోంది బెంగళూర్‌లో అని తెలిపింది. నటుడు అశోక్‌కు జంటగా నటించే అవకాశం రావడంతో ఓకే చెప్పేశానని, చిత్ర నిర్మాణం పూర్తి కావచ్చిందని తెలిపింది. ఇకపై వరుసగా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని, తన మేనత్త కంటే అధిక చిత్రాల్లో నటించి, ఆమె కంటే అధిక అవార్డులు పొంది వాటిని అత్తకు కానుకగా సమర్పించాలని ఆశిస్తున్నానని హృతిక తన మనసులోని మాటను తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment