జెండర్‌ని బట్టి అంచనా వేయడం తప్పు!
ప్రతి డెరైక్టర్‌కీ స్ట్రగుల్స్ ఉంటాయి. అయితే, లేడీ డెరైక్టర్‌ని కావడం నాకు ఎడ్వాంటేజ్, డిజ్ ఎడ్వాంటేజ్ - రెండూ అయింది. నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నట్లు ‘అంచనాలేవీ ఉండకపోవడం’ ఒక ఎడ్వాంటేజ్. అమ్మాయిని కాబట్టి, ఏ డాక్యుమెంటరీ కథో, లేడీ ఓరియంటెడ్ కథో చెబుతాననుకొంటారు. అయితే, కొంచెం మంచి కథ చెప్పినా, భలే చెప్పిందనుకుంటారు. అది ప్లస్ పాయిం టని సురేశ్‌బాబు అన్నారు. ఏది ఎలా ఉన్నా, కొండ ఎక్కాలి తప్పదు అనుకుంటే అందులో వచ్చే కష్టనష్టాల గురించి ఆలో చిస్తూ కూర్చోకూడదు. నేను ట్రెక్కింగ్‌కు వె ళ్లినప్పుడు ఫస్ట్ రోజు కొండ ఎలా ఎక్కాలా అని భయపడ్డా. కానీ ‘ఎక్కాలి, తప్పదు’ అనుకున్నాక, ఎప్పుడూ తరువాత వేసే నాలుగు అడుగుల మీదే దృష్టి పెట్టేదాన్ని. ఆ నాలుగూ కాగానే, మళ్ళీ నాలుగే అడుగులు అనుకుంటూ ముందుకెళ్ళేదాన్ని.
అలా డెరైక్టర్ కావడానికి ఆరేళ్ళపాటు పడని కష్టం లేదు. చుక్కలు చూశా. నా మొదటి సినిమా ‘అలా మొదలైంది’ (2011) నిర్మాణం, రిలీజ్‌కి కూడా అంతే! ఆ సినిమా రిలీజయ్యాక ఊహించని సక్సెస్ అవడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ ఇప్పుడు మూడో సినిమా ‘కళ్యాణ వైభోగమే’ సక్సెస్ అయింది.
ఏ ఫీల్డ్ అయినా టాలెంట్ మీద బేస్ అయి ఉంటుంది. జెండర్‌తో ముడిపడిన వ్యవహారం కాదు. ప్రతిభను స్త్రీనా, పురుషుడా అనే జెండర్‌ను బట్టి అంచనా వేయడం తప్పు. ఒక వ్యక్తి ఓ స్థాయికి రీచ్ అయ్యాడంటే అతను పడిన కష్టాలు, అనుభవాలు అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ మానేసి మనం జెండర్ ఒకటే చూస్తాం! జెండర్ బట్టి మహా అయితే టెంపర్‌మెంట్ డిసైడ్ అవుతుంది. అంతే! ‘వాళ్లు అమ్మాయిలు కాబట్టి సాఫ్ట్’ అని అంటూ ఉంటారు. కానీ, బేసిగ్గా మనస్తత్వానికీ, జెండర్‌కూ ఎలాంటి సంబంధమూ లేదు.
ఇంటిని మొత్తం మేనేజ్ చేసే ఆడవాళ్లకి సినిమా నిర్మాణంలోని 24 క్రాఫ్ట్‌లూ హ్యాండిల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కాంప్లికేషన్స్ అనేవి నువ్వు ఎలా వాటిని ఫేస్ చేయగలుగుతున్నావనేది పాయింట్ గానీ అక్కడ జెండర్ ఉండదు. నా మటుకు నేను -కెమేరా పక్కకు జరపడం దగ్గర నుంచి ఏదైనా సరే -ఒక పని జరగాలీ అంటే, అందరినీ గట్టిగా పిలుస్తూ, అరుస్తూ, హుషారెత్తిస్తూ నేనూ ఓ చెయ్యేసి, పనిచేసేస్తా.
ఇతరుల మీద ఆధారపడను. పని జరగడం ముఖ్యమే తప్ప, ఎవరు చేశారన్నది కాదు. క్లాప్ కొట్టడం దగ్గర నుంచి ఏదైనా అసిస్ట్ చేసేస్తా! నన్నడిగితే, ఇంకొన్నేళ్లలో ‘లేడీ డెరైక్టర్స్’ అనే మాటే ఉండదు. కేవలం ‘డెరైక్టర్’ అనేదే ఉంటుంది. ఇప్పటికే ఆ మార్పు వచ్చేస్తోంది. ఇవాళ ఇండియాలో అగ్రశ్రేణి డెరైక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో గౌరీ షిండే, అంజలీ మీనన్, జోయా అఖ్తర్ లాంటి మహిళల పేర్లు ఉన్నాయి. - నందినీ రెడ్డి, సినీ దర్శకురాలు (‘అలా మొదలైంది’, ‘కళ్యాణ వైభోగమే’ ఫేమ్)