
‘పాత’ నోటు చెల్లదు.. ‘కొత్త’ సినిమా ఆగదు!
‘దయచేసి టికెట్‌కి సరిపడా చిల్లర ఇవ్వగలరు’ - ఆర్టీసీ బస్‌లో ప్రయాణించే సామాన్యులకు ఈ మాటలు సుపరిచితమే. సినిమా బుకింగ్ టికెట్ కౌంటర్ల దగ్గర ఇప్పుడీ తరహాలో ‘కొత్త రూ.500, రూ.2,000 నోట్లు మాత్రమే తీసుకోబడును. లేదా టికెట్‌కి సరిపడా చిల్లర (రూ.100, రూ.50, రూ.20, రూ.10...) ఇవ్వగలరు’ అని బోర్డులు పెడితే...??
ఇప్పుడు సగటు సినీ ప్రేక్షకుడితో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులను ఆలోచనలో పడేసిన విషయం ఇదే. రూ.500, 1,000 నోట్లను ఉపహరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమలోనూ చర్చనీయాంశమైంది. తెలుగు సినిమాపై నోట్ల మార్పిడి అంశం ఎటువంటి ప్రభావం చూపుతుందోనని లెక్కలు వేస్తున్నారు. దేశ ప్రధాని మోదీ నిర్ణయం షూటింగ్‌లకు ఏమైనా బ్రేక్ వేస్తుందా? సినిమా వసూళ్లకు గండి కొడుతుందా? చిత్రసీమలో ముఖ్యమైన లావాదేవీలన్నీ బ్లాక్‌లోనే జరుగుతాయని ఎప్పట్నుంచో ఓ టాక్ ఉంది. ఇకపై ఆ అభిప్రాయానికి తావు లేకుండా అందరూ వైట్‌లోకి వచ్చేస్తారా? ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది - ‘సాక్షి’ సినిమా డెస్క్
మల్టీప్లెక్స్‌లో ఓ ముగ్గురు సినిమా చూడాలంటే టికెట్స్‌కి రూ.500 నోటు బయటకు తీయాల్సిందే. ఓ ఫ్యామిలీ అంతా సింగిల్ స్క్రీన్, బాల్కనీలో దర్జాగా సినిమా చూడాలన్నా రూ. 500 అవసరమే. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ప్రేక్షకులకు ఏ సమస్యా లేదు. థియేటర్ దగ్గర కౌంటర్‌లో టికెట్ కొనే ప్రేక్షకుడి చేతిలో కొత్త రూ.500, 2,000 నోట్లు లేదా చిల్లర మహాలక్ష్మి(వందలు) లేకపోతే తిప్పలు తప్పేట్లు కనిపించడం లేదు. హైదరాబాద్‌లో ప్రముఖ మల్టీప్లెక్స్ ప్రసాద్ ఐమ్యాక్స్ టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేవారు 70 శాతం మంది ఉన్నారు.
మిగతా 30 శాతం టికెట్స్ కౌంటర్‌లోనే అమ్ముడవుతున్నాయి. సింగిల్ స్క్రీన్‌లలో సీన్ రివర్స్‌లో ఉంది. ఇక్కడ ఆన్‌లైన్ టికెట్స్ బుక్ చేసుకునేవారి సంఖ్య 30 శాతమే. 70 శాతం మంది థియేటర్ దగ్గర కౌంటర్‌లో టికెట్స్ కొంటున్నారు. బ్యాంకుల దగ్గర గంటల పాటు లైన్‌లో నిలబడి చేతిలో ఉన్న పాత నోట్లు మార్చుకునే కొత్త నోటుతో ఎంతమంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారనే ప్రశ్నకు సమాధానం రానున్న రోజుల్లో సినిమా వసూళ్లు చెబుతారుు.
నిర్మాతలకు కష్టమేనా!!
పాత పెద్ద నోట్లు చెల్లకపోవడంతో సినిమా విడుదలకు ఇబ్బందులు ఉంటాయా? ఉండవా? అనే చర్చకు మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మరి, షూటింగ్‌ల పరిస్థితి ఏంటి?.. ‘‘నా సినిమా షూటింగ్ మధ్యలో ఉంది. నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఫైనాన్షియర్ దగ్గర మొన్నే కోటి రూపాయలు తీసుకొచ్చా. ఆయనేమో ఇప్పుడు బ్యాంకులో నన్నే పాత నోట్లు మార్చి, కొత్త నోట్లు తీసుకోమని చెప్పాడు. ఈ లెక్కలు నేనెక్కడ సెట్ చేయాలి’’ అని ఓ నిర్మాత వాపోయారు. పేమెంట్స్, ఫైనాన్‌స, వడ్డీలు.. చిత్ర పరిశ్రమలో కొంత వరకూ బ్లాక్‌లో జరుగుతాయనే టాక్ ఉన్న విషయం తెలిసిందే!! ఇకపై, ఆ దందాలకు చెక్ పడుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
అసలు లెక్కలు బయటకు వస్తాయా?
ఓ భారీ నిర్మాత, ‘మా సినిమా ఇండస్ట్రీ హిట్. రికార్డు వసూళ్లు సాధించింది’ అని ప్రకటించారు. మూడు రోజుల తర్వాత ఆదాయపు పన్ను అధికారులు సదరు నిర్మాత ఆఫీసుకి వెళ్లగా, ‘ప్రచారం కోసమే ఆ ప్రకటన చేశాం. అంత వసూలు చేయలేదు’ అనే సమాధానం వినిపించింది. ఓ స్టార్ హీరో సినిమా వంద కోట్లు సాధించిందని ఘనంగా ప్రకటించారు. అరుుతే.. హీరోకి సన్నిహితులైన డిస్ట్రిబ్యూటర్లు వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యా లెక్కలు ఎక్కువ చేసి చూపించారని ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న గుసగుస.
నిజానికి, ఎక్కువ శాతం నిర్మాతలు ప్రకటించే వసూళ్లకూ, ఆదాయపు పన్ను లెక్కల్లో చూపించే వసూళ్లకు సంబంధం ఉండదని కొందరు పరిశ్రమ వర్గీయులు అంటారు. ఆయా సినిమాలు అంత వసూలు చేయడం లేదా? లెక్కల్లో అసలు నొక్కేసి బ్లాక్‌లోకి పంపిస్తున్నారా? అనే సందేహాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇకపై రాబోయే సినిమాల వసూళ్ల వ్యవహారం ‘బ్లాక్ అండ్ వైట్’లా కాకుండా పూర్తి ‘వైట్’లోనే ఉంటుందని భావిస్తున్నారు.
చిక్కుల్లో చిన్న నిర్మాతలు
పెద్ద సినిమాలు తీసే నిర్మాతలు దాదాపు ‘సేఫ్’గా ఉంటారు. కానీ, చిన్న చిత్రాల నిర్మాతలకు కష్టాలు తప్పవు. డబ్బు సమకూర్చుకుని సినిమా తీయడం, తీసిన తర్వాత థియేటర్లు దక్కించుకోవడం అంతా పెద్ద సమస్యే. ఇప్పుడు పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు రావడం కొంతమంది చిన్న నిర్మాతలకు ఇబ్బందిగా మారింది. రోజువారీ షూటింగ్ కోసం పెట్టుకున్న డబ్బులో పెద్ద నోట్లు ఇప్పుడు చెల్లకుండా పోయాయి. ఏటీయంలో తీసుకుందామన్నా రోజుకి 2000కు మించకూడదు కాబట్టి, ‘ఎనీ టైమ్ మనీ’ వల్ల కూడా ఉపయోగం లేదు. బ్యాంకుల్లో విత్‌డ్రా చేసుకోవడానికి పరిమితులున్నాయి. ఫలితంగా కొన్ని షూటింగ్‌స రద్దు అయ్యాయని ఫిల్మ్‌నగర్ టాక్.
ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే...
100 రూపాయలు ఉన్నవాడే ఇవాళ ‘ధనవంతుడు’,
పెద్ద నోట్లు ఉన్నవాడు ‘పేదవాడు’.
లావాదేవీలకు ఇబ్బందే
‘‘చెక్స్ రూపంలో కాకుండా క్యాష్ రూపంలో లావాదేవీలు నడిపేవాళ్లు ఇబ్బందులు పడతారు. షూటింగ్‌కి అయ్యే డబ్బుకి ఇబ్బంది తప్పదు. ఈ కారణంగా షూటింగ్‌స రద్దయ్యే ప్రమాదం ఉంది. రానున్న రెండు నెలల్లో విడుదలయ్యే సినిమాల్లో కొన్నింటికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది’’ - తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్
భవిష్యత్తులో ఇదే బాగుంటుంది
‘‘రానున్న రోజుల్లో విడుదల కాబోయే సినిమాల్లో నేను ఫైనాన్‌స చేసినవి కొన్ని ఉన్నారుు. సినిమా రిలీజు సమయంలో మొత్తం డబ్బు వెనక్కి ఇవ్వలేని పరిస్థితిలో నిర్మాతలు పడిపోయారు. నిర్మాతల పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది కాబట్టి.. డబ్బు చెల్లించాల్సిందేనని పట్టుబట్టలేం. గుడ్డి నమ్మకంతో వెళ్లిపోవడమే’’ - ఫైనాన్షియర్-పంపిణీదారుడు సాయిమహేశ్వర రెడ్డి
వెనక్కి పంపించేశారు
‘‘బుధవారం రూ.500 నోటుతో థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుణ్ణి పలు చోట్ల వెనక్కి పంపించేశారు. ఎంతమంది దగ్గర వంద నోట్లుంటాయి చెప్పండి. దీని వల్ల వసూళ్లు తగ్గుతాయి. ‘మా సినిమా విడుదల చేయాలా? వద్దా?’ అని త్వరలో రాబోయే సినిమా నిర్మాతలు సలహా అడుగుతుంటే.. ఏం చెప్పలేని పరిస్థితి’’ - ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ‘దిల్’ రాజు.
ప్రభావం చూపించదు..
పెద్ద నోటు రద్దు చిత్రపరిశ్రమపై పెద్దగా ప్రభావం చూపించదనే అనుకుంటున్నా. లావాదేవీల విషయంలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియర్లకు సమస్యే. మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ఎక్కువ శాతం ఆన్‌లైన్‌లో కొనేస్తున్నారు. సామాన్య థియేటర్లలో టికెట్ ధర వంద లోపే ఉంటుంది కాబట్టి, నో ప్రాబ్లమ్. - నిర్మాత అనిల్ సుంకర
కన్ఫ్యూజన్ కామన్
తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు, నగదుతో లావాదేవీలు ముడిపడిన ప్రతి రంగంలోనూ అవినీతి, నల్లధనం ఉన్నాయి. వాటిని అరికట్టడానికి ఇదో అద్భుత అవకాశం. ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ప్రారంభంలో కన్ఫ్యూజన్ ఉండటం కామన్. కానీ, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుంది.- దర్శకుడు ఎన్.శంకర్