
అఅఆచారి మలేసియా యాత్ర
అదేంటి... ‘ఆచారి మలేసియా యాత్ర’ అంటున్నారు? మంచు విష్ణు కొత్త సినిమా పేరు ‘ఆచారి అమెరికా యాత్ర’ కదా! టైటిల్ ఏమైనా మారిందా? అనుకోవద్దు. ఎందుకంటే... టైటిల్ మారలేదు. జస్ట్... షూటింగ్ స్పాట్ మారిందంతే. మంచు విష్ణు హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తీ చౌదరి, కిట్టు నిర్మిస్తున్న సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. విష్ణుకు జోడీగా ప్రగ్యా జైశ్వాల్, కీలక పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నారు.
ఈ సినిమా మూడో షెడ్యూల్ ఆదివారం మలేసియాలో మొదలైంది. ‘‘మల్లాది వెంకట కృష్ణమూర్తి అద్భుతమైన కథ అందించారు. విష్ణు–బ్రహ్మానందం కలయికలో సన్నివేశాలు విపరీతంగా నవ్విస్తాయి. ఈ మలేసియా షెడ్యూల్‌లో ముఖ్య తారాగణంపై వినోదాత్మక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్ తర్వాత యూనిట్ అమెరికా వెళ్లనుంది. అక్కడ మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేశాం’’ అన్నారు నిర్మాతలు. తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, ఎల్బీ శ్రీరామ్, విద్యుల్లేఖా రామన్, ‘ప్రభాస్’ శీను, పోసాని తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మాటలు: ‘డార్లింగ్’ స్వామి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, కూర్పు: ఎస్.ఆర్. శేఖర్, కళ: కిరణ్, కెమెరా: సిద్ధార్థ.