తమిళసినిమా: నటుడు విజయ్‌సేతుపతి, తాను కలిసి చేసిన రొమాన్స్‌ను ప్రేక్షకులు మెచ్చారని నటి రమ్యానంబీశన్ అంటోంది. సేతుపతి చిత్రం తరువాత ఈ బ్యూటీ కోలీవుడ్‌లో నట్పున్నా ఎన్నాన్ను తెరియుమా, సత్య చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా కన్నడంలో దర్శన్ నిర్మిస్తూ, నటిస్తున్న పురాణ ఇతిహాస కథా చిత్రం కురుక్షేత్రంలో నటిస్తోంది. ఈ అమ్మడు కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాల వేటలో పడిందట.
నటుడు విజయ్ సేతుపతికి జంటగా నటించే అవకాశం మళ్లీ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న రమ్యానంబీశన్ మాట్లాడుతూ తాను ఇంతకు ముందు కొన్ని తమిళ చిత్రాల్లో నటించినా విజయ్‌సేతుపతికి జంటగా నటించిన పిజ్జా చిత్రం నటిగా తనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని చెప్పింది. ఆ తరువాత మరికొన్ని చిత్రాలు చేసినా మళ్లీ విజయ్‌సేతుపతితో కలిసి నటించిన సేతుపతి చిత్రంతో పేరు వచ్చిందని పేర్కొంది.
ఈ చిత్రంలో తమ రొమాన్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయని చెప్పింది. అందువల్ల తమది హిట్ పెయిర్‌గా పేర్కొంది. అందువల్ల మళ్లీ ఆయనతో నటించాలని ఆశపడుతున్నానంది. విజయ్‌సేతుపతితో మళ్లీ జత కట్టే అవకాశం వస్తుందనే నమ్మకం తనకు ఉందని అంది. అయితే అలాంటి మంచి కథ అమరాలని రమ్యానంబీశన్ అంది.