
చండీగఢ్ : బాలీవుడ్ సెలబ్రిటీలు మరోసారి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఓ టీవీ షోలో పాల్గొన్న బాలీవుడ్ నటి రవీనా టాండన్, దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, హాస్యనటి భారతి సింగ్‌లు మత భావాలకు వ్యతిరేకమైన వ్యాఖలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా వారు వ్యాఖ్యలు చేశారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ అజ్నాలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా వీరిపై మరో కేసు నమోదైంది. మతాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. కంబోజ్‌నగర్ వాసి పోలీసులను ఆశ్రయించారు.
దీంతో పోలీసులు శనివారం వారిపై కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295-ఎ ప్రకారం వారిపై కేసు నమోదు చేశామని ఫిరోజ్‌పూర్ ఎస్‌ఎస్‌పీ వివేక్ శీల్ సోనీ పేర్కొన్నారు. వీరిపై ఎఫ్‌ఐర్ నమోదు కావటం ఈ వారంలో మూడోసారి కావడం గమనార్హం. వివిధ సెక్షన్ల కింద ఈ ముగ్గురు బాలీవుడ్ సెలబ్రిటీలుపై కేసు నమోదు చేశామని.. తదుపరి దర్యాప్తు జరుగుతోందని అమృత్‌సర్ రూరల్ పోలీసు అధికారి విక్రమ్ జీత్ దుగ్గల్ తెలిపారు.
ఈ ఆరోపణలపై బాలీవుడ్ నటి రవీన్ టాండన్ స్పందిస్తూ.. తాను ఏ మతాన్ని అవమానించినట్లు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఇదివరకే తెలిపారు. తన సహచర నటులు ఫరా ఖాన్, భారతి సింగ్‌లు సైతం ఎవరిని అవమానించలేదని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. మరోవైపు తాము అన్ని మతాలను గౌరవిస్తామని.. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశం తమకు లేదని హాస్యనటి భారతి సింగ్ అన్నారు. తమ వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా గాయపడితే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని భారతి సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment