ఇది లవ్‌స్టోరీ కాదు.. లైఫ్ స్టోరీ..!
ఇది లవ్‌స్టోరీ కాదు.. లైఫ్ స్టోరీ..!
Published Wed, Aug 28 2013 12:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
‘‘ ‘సొంతవూరు’ సినిమాలో మరణం గురించి చర్చించాను. ఈ చిత్రంలో జీవితం గురించి చెప్పాను. జీవితాన్నీ మరణాన్నీ ఎవ్వరూ తప్పించుకోలేరు. అందుకే ఆ సినిమాలాగే ఇది కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది. ‘వెయిటింగ్ ఫర్ యూ’ అనేది లవ్‌స్టోరీ కాదు. లైఫ్ స్టోరీ’’ అని పి.సునీల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆయన దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు నిర్మించిన ‘వెయిటింగ్ ఫర్ యూ’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సందర్భంగా సునీల్‌కుమార్ రెడ్డి విలేకర్లతో ముచ్చటిస్తూ -‘‘వైజాగ్‌కు చెందిన ఓ అమ్మాయి యదార్థ జీవితం ప్రేరణతో చాలా పరిశోధన చేసి ఈ కథ తయారు చేశాను. గర్భం దాల్చిన ఓ ఒంటరి అమ్మాయి జీవితం తాలూకు అనేక కోణాల్ని ఇందులో ఆవిష్కరించాం’’ అన్నారు. పేరున్న కథానాయికతో ఈ సినిమా చేసి ఉండొచ్చుగా అన్న ప్రశ్నకు సునీల్‌కుమార్ జవాబిస్తూ -‘‘ఇది కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. ఆ కాన్సెప్ట్‌ని వదిలేసి స్టార్ ఇమేజ్‌ని నమ్ముకోవాలనుకోలేదు... అమ్ముకోవాలనుకోలేదు’’ అన్నారు.
ఈ సినిమాకు చేస్తున్న విభిన్న ప్రచారం గురించి విశ్లేషిస్తూ -‘‘ ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’కు ముసుగు వేసుకున్న అమ్మాయిల పోస్టర్లతో చేసిన ప్రచారం ఫలించింది. దీనికి ఓ ప్రెగ్నెంట్ అమ్మాయి ఫొటోతో ప్రచారం చేస్తున్నాం. కాన్సెప్ట్ కోసమే ఇలా చేస్తున్నాం.
ఇలా అన్ని సినిమాలకూ చేయలేము’’ అని తెలిపారు. 2001లో ‘సెలైన్స్ ప్లీజ్’ చిత్రంతో దర్శకునిగా తన కెరీర్ మొదలైందని, తనకిది పదో చిత్రమని సునీల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రామానాయుడు సంస్థలో చేస్తున్న ‘నేనేం చిన్నపిల్లనా’ కూడా తన కెరీర్‌కి మంచి మలుపు అవుతుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తానని ఆయన వెల్లడించారు.
Advertisement
Advertisement