ఇది పైరసీ కాదు.. నామీద చేసిన కుట్ర: పవన్ కళ్యాణ్
'సహిస్తా.. భరిస్తా.. అవసరమతే తాటతీస్తా' అంటూ పవన్ కళ్యాణ్ తన 'అత్తారింటికి దారేది' సక్సెస్ మీట్లో తొడగొట్టారు. సినిమా విడుదలకు ముందే పైరసీ సీడీలు మార్కెట్లోకి విడుదల కావడం కేవలం తమ మీద చేసిన కుట్రేనని ఆయన మండిపడ్డారు. తాను అందరి సంగతి చూసుకుంటానని చెబుతూ.. అది ఏస్థాయి వాళ్లయినా వారికి తగిన శాస్తి జరుగుతుందన్నారు. సోమవారం రాత్రి జరిగిన సినిమా సక్సెస్ మీట్లో పవన్ ఇలా మాట్లాడారు...
''పైరసీని బయటి జనం చూడలేదేమో గానీ, చిత్రపరిశ్రమలో చాలామంది ప్రముఖులు చూసేశారు. ఇండస్ట్రీని నమ్ముకున్నవాళ్లు, పరిశ్రమే వాళ్ల కుటుంబాలకు ఆధారం అయినవాళ్లు మాత్రం పైరసీని బాగానే ప్రోత్సహించారు. సినిమాను ఐప్యాడ్లోకి, డెస్క్టాప్ లోకి డౌన్లోడ్ చేసుకుని మరీ చూశారు. పోని చూసి వదిలేశారా.. మాకు ఫోన్ చేసి, మీరేం భయపడక్కర్లేదు సినిమా చాలాబాగుందనేసరికి వాళ్లను చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఒక్కళ్లు, ఇద్దరయితే పేర్లు చెప్పచ్చు. కానీ ఎంతమందని చెప్పాలి? అలా వింటూ కూర్చున్నాం. అసలు వీళ్లకి కామన్ సెన్స్ ఉందా? ఎద్దుపుండు కాకికి రుచి.. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్నాం. కంచే చేను మేసినట్లుగా, ద్రోహం చేసింది బయటివారు కాదు.. లోపలివాళ్లే. ఇది పైరసీ అనిపించట్లేదు.. ఇదో కాన్స్పిరసీ. నిజంగా పైరసీ చేయాలనుకుంటే 50 రోజులు అలా గుప్పెట్లో పెట్టుకోరు. ఎవరి మాటలు విని వీళ్లు పైరసీ చేశారో, వాళ్లందరినీ నేను సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఈ పైరసీని చెయ్యమని ఎవరైతే ప్రోత్సహించారో.. వాళ్లందరినీ రాబోయే సంవత్సరాల్లో పేరుపేరునా గుర్తుపెట్టుకుంటా. వాళ్లు ఏ స్థాయివాళ్లయినా సరే.. అందరికీ ఎలాంటి న్యాయం జరగాలో అలాంటి న్యాయం జరిగేలా చూస్తాను. సహిస్తా.. భరిస్తా..అవసరమైతే తాటతీస్తా'' అని పవన్ అన్నారు.
అయితే.. పవన్ ప్రసంగం మొత్తమ్మీద వివాదాస్పద విషయం మరోటి ఉంది. చలన చిత్ర అభివృద్ధి మండలి (ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్ -ఎఫ్డీసీ) సభ్యులలో కొంతమంది కూడా పైరసీ సినిమా చూసేశారని, వాళ్లు ఆ తర్వాత తనకు నేరుగా ఫోన్ చేసి, సినిమా బాగుంది కాబట్టి పైరసీ గురించి ఏమాత్రం భయపడొద్దని చెప్పారన్నారు. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే.. చివరకు ఎఫ్డీసీ సభ్యులు కూడా పైరసీ సినిమాలు చూస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందని అనుకోవాలా? లేదా... పైరసీ సినిమాలను ఎవరెవరు చూశారన్న విషయం కూడా.. అంటే పేర్లు కూడా ఆయనకు తెలిసినా పోలీసులకు చెప్పకుండా ఊరుకున్నందుకు ఆయన నిజాయితీని కూడా అనుమానించాలా అని టాలీవుడ్ వర్గాలు విస్తుపోతున్నాయి. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా పవన్ చాలా నిజాయితీగా ఉంటారని అత్తారింటికి సినిమా దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ పలు సందర్భాల్లో చెప్పారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పేర్లు బయటపెట్టకపోవడంతో పవన్ మీద విమర్శలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి.