
అకారణంగానే చెంప చెళ్లుమనిపించిందా?
చెన్నై: 'తుపాకి' నటి మీనాక్షి.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించడం వివాదం రేపింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఓ తమిళ సినిమా షూటింగ్ సందర్భంగా చిత్ర సహాయ దర్శకుడిపై మీనాక్షి చేయిచేసుకుంది. చెన్నై పాత మహాబలిపురం రోడ్డులోని ఫిలిం సిటీ ప్రాంగణంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హఠాత్పరిణామంతో యూనిట్ సభ్యులంతా షాకయ్యారట. సదరు సహాయ దర్శకుడికి మద్దతుగా యూనిట్ సభ్యులు, ఇతర టెక్నీషియన్లు ఆందోళనకు దిగారు. అకారణంగా,. అన్యాయంగా ఆమె కొట్టిందంటూ వారంతా మండిపడ్డారు. సహాయ దర్శకుడికి క్షమాపణలు చెప్పాలని, అప్పటివరకు ఆమెను షూటింగ్ స్పాట్ నుంచి కదలనివ్వబోమని పట్టుబట్టారు. దీంతో మీనాక్షి.. ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌కు క్షమాపణలు చెబుతూ, లేఖ రాసింది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడనని, బుద్ధిగా ఉంటానని మీనాక్షి చెప్పడంతో పరిస్థితి చక్కబడింది.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘తుపాకి' చిత్రంలో హీరోయిన్ కాజల్ స్నేహితురాలి పాత్రలో నటించిన మీనాక్షి.. ప్రస్తుతం నేర్‌ముగమ్ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. అయితే ఇద్దరి మధ్య బయటకు చెప్పుకోలేని గొడవ ఏదైనా జరిగిందా? అసలు ఏం జరిగిందనేది ఎవరికీ అంతుబట్టక మల్లగుల్లాలు పడుతున్నారట. మీనాక్షి ఎందుకు అలా ప్రవర్తించిందనే విషయం ఎటూ తేలక సినీజనం ఆరా తీస్తున్నారు.