ముంబై: సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'టైగర్ జిందా హై' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అంచనాలకు మించి వసూళ్లు రాబడుతూ.. త్వరలోనే వందకోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టే దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా తొలి రెండురోజుల కలెక్షన్స్ వివరాలు కళ్లు చెదిరేలా ఉన్నాయి. మొత్తానికి వరుస ప్లాపులతో డీలాపడిన బాలీవుడ్‌లో కొత్త జోష్ నింపేలా ఈ కలెక్షన్లు ఉండటం గమనార్హం.
ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చినా.. సల్మాన్ ఛరిష్మా కారణంగా భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్‌టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తొలిరోజు రూ. 33 కోట్లు రాబట్టగా.. రెండోరోజు శనివారం ఏకంగా రూ. 34.10 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. మొత్తం మీద రెండురోజుల్లో రూ. 69.40 కోట్లు కలెక్ట్ చేసిన ‘టైగర్ జిందా హై’... నేడు, రేపు మరో రెండురోజులు సెలవులు ఉండటంతో అతిత్వరలోనే వందకోట్ల మార్కును అందుకునే అవకాశముందని సినీ ట్రేడ్ నిపుణుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో తెలిపారు. మూడురోజుల్లోనే ఈ సినిమా వందకోట్ల మార్కును దాటితే.. అత్యంత వేగంగా వందకోట్ల క్లబ్బులో చేరిన సినిమాగా ’టైగర్ జిందా హై’ నిలువనుంది. ఇప్పటికే, బాహుబలి-2 తర్వాత తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'టైగర్ జిందా హై' రికార్డు సాధించింది. సల్మాన్, కత్రినా కైఫ్ జంటగా అలీ అబ్బాస్ తెరకెక్కిన ’టైగర్ జిందా హై’ .. ఏక్ థా టైగర్ చిత్రానికి సీక్వెల్.
Comments
Please login to add a commentAdd a comment