సెన్సార్‌కు భయపడకూడదు
తమిళసినిమా: చిత్ర నిర్మాతలు సెన్సార్ బోర్డుకు భయపడకూడదని సీనియర్ నటుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు ఎస్‌వీ.శేఖర్ వ్యాఖ్యానించారు. కే 3 క్రియేషన్‌స పతాకంపై ప్రతాప్ మురళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం తిట్టివాసల్. ప్రముఖ నటుడు నాజర్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో మహేంద్రన్, తనూశెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. చిత్ర ఆడియో, ట్రైలర్‌లను నటుడు, నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్ ఆవిష్కరించగా తొలి ప్రతులను ఎస్‌వీ.శేఖర్, యూటీవీ ధనుంజయన్ అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్‌వీ.శేఖర్ మాట్లాడుతూ ఖర్చు చేసే ప్రతి రూపాయి చిత్రంలో తెలియాలన్నారు. అది ఈ చిత్రంలో స్పష్టంగా తెలుస్తోందని అందుకు చిత్ర నిర్మాతను అభినందిస్తున్నానని అన్నారు.అయితే ఒక సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఒక సూచన చేయాలనుకుంటున్నానన్నారు. దయ చేసి చిత్ర విడుదల తేదీని నిర్ణయించి సెన్సార్‌కు వెళ్లకండని అన్నారు. అలా వెళితే తగిన సమయం లేకపోవడంతో సెన్సార్ వారు షరతులకు తలవంచాల్సి వస్తుందన్నారు. నిర్మాతలకు ధైర్యం చాలా అవసరం అన్నారు.చిత్రాలు మీవని, మీరు చట్టబద్ధంగానే చిత్రాలు చేస్తున్నారని, అందువల్ల సెన్సార్ వారి చెప్పినట్లు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. విడుదలకు సమయం ఉంటే సెన్సార్ వారి నిబంధనలకు తలవంచాల్సిన అవసరం మీకుండదని ఎస్‌వీ.శేఖర్ అన్నారు.