అనుకోకుండా ఒక ఏడాది | tollywood heros and heroins miss the 2018 | Sakshi
Sakshi News home page

అనుకోకుండా ఒక ఏడాది

Published Tue, Aug 14 2018 12:00 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

tollywood heros and heroins miss the 2018 - Sakshi

ఈ స్టార్స్‌ డైరీలు ఎప్పుడూ ఫుల్‌గానే ఉంటాయి. స్క్రీన్‌ మీద వీళ్లు కనబడితేనే పెద్ద హిట్‌.అయితే అనుకోకుండా ఒక్కోసారి అనుకోనిది జరుగుతూ ఉంటుంది.ఒక సంవత్సరం వీళ్లు కనపడకుండా మిస్‌ అయిపోతారు. 2018 మొత్తంలో ఒక్కసారి కూడా స్క్రీన్‌ మీద కనిపించబోని స్టార్ల కథ ఇది. అద్భుతమైన ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కోసమో, ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికంటే గొప్పగా చూపించడం కోసమో.. రిలీజ్‌ డేట్లు లేట్‌ అవుతూ ఉంటాయి.అభిమానులకు కొంచెం నిరాశ కలిగినా, లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తారన్న నమ్మకం వాళ్ల కళ్లల్లో కనపడుతూనే ఉంటుంది.

2018... తెలుగు ఇండస్ట్రీకి హుషారుగా సాగుతోందనే చెప్పాలి. ‘భరత్‌ అనే నేను’, ‘రంగస్థలం’, ‘మహానటి’ వంటి పెద్ద సినిమాలు ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘అ’, ‘ఛలో’, ‘సమ్మోహనం’, ‘గూఢచారి’, ‘చి.ల. సౌ’ వంటి చిన్న సినిమాలు హిట్‌ అయ్యి ప్రేక్షకులను మంచి మూడ్‌లో పెట్టాయి. ఇలాంటి టైములో ప్రతి స్టార్‌ తనకో సినిమా ఉంటే బాగుండు అనుకుంటాడు. అభిమానులు కూడా తమ హీరో సినిమా ఒకటి రిలీజ్‌ అవ్వాలని ఎదురు చూస్తారు. గతంలో ఒక్కో హీరో ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసేవారు కనుక ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమా రిలీజయ్యి వాళ్లకూ అభిమానులకూ మధ్య ఎడం లేకుండా చేసేది. ఇప్పుడు ప్రతి హీరో ఒకే సమయంలో ఒకే సినిమా చేస్తున్నందు వల్ల అవి కాస్త డిలే అయితే వారి డైరీలో ఏకంగా ఒక సంవత్సరం మిస్‌ అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం కొంతమంది హీరోల ఒక్క సినిమా కూడా రిలీజ్‌ కాదు అనేది అభిమానులను నిరాశపరిచే సంగతే. తెలుగులోనూ హిందీలోనూ ఇలా 2018ని మిస్సవుతున్న స్టార్లు ఎవరో చూద్దాం.

చిరంజీవి: సైరా నైరా
‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అని సంబరపడిన అభిమానులు ఇక వెండి తెర మీద వరుసగా చిరంజీవిని చూడటమే బాకీ అనుకున్నారు. ఆయన 150వ సినిమా ‘ఖైదీ నంబర్‌ 150’ రిలీౖజై హిట్‌ అయితే  వెంటనే నెక్ట్స్‌ సినిమా ఉంటుందని సంబరపడ్డారు. అందుకు తగ్గట్లుగా గతేడాది బర్త్‌డే నాడు ‘సైరా’ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు చిరంజీవి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా హీరో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు సురేందర్‌రెడ్డి. 2017లో ఖైదీగా వచ్చిన చిరంజీవి 2018లో సైరాగా వస్తారని ఆశించిన ఫ్యాన్స్‌ 2018లో ఆ చాన్స్‌ లేదని తెలిసి నిరాశపడతున్నారు. నిజానికి ఈ సినిమా మొదట్లోనే లుక్‌ టెస్ట్‌ కోసం ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. రీసెంట్‌గా పడిన వర్షాలతో ‘సైరా’ టీమ్‌ ఇబ్బంది పడింది. కొన్ని కారణాల వల్ల సెట్‌ను మరో చోటకు చేంజ్‌ చేయాల్సి వచ్చింది. ఫారిన్‌ షెడ్యూల్‌  బ్యాలెన్స్‌ ఉంది. ఇవన్నీ కాక పిరియాడికల్‌ మూవీ కావడంతో బోలెడంత గ్రాఫిక్స్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. ‘సైరా’కి ఎక్కువ టైమ్‌ పట్టడానికి కారణాలు ఇవే అయి ఉంటాయని ఊహించవచ్చు. వచ్చే ఏడాది సమ్మర్‌లో సైరా థియేటర్స్‌లోకి వస్తాడన్న వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్‌: ఆ కళ్లు వెతుకుతున్నాయి
‘బాహుబలి–2’ చూడటానికి థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులను టీజర్‌ రూపంలో ‘సాహో’ పలకరించాడు. 2018లో ఆ సినిమాతో తాను థియేటర్స్‌లోకి వస్తానని ప్రభాస్‌ హింట్‌ ఇచ్చారు. కానీ ‘బాహుబలి –2’ రిలీజ్‌ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రభాస్‌ క్రేజ్‌ డబుల్‌ ట్రిపుల్‌ అయ్యింది. ‘సాహో’ బడ్జెట్‌ కూడా పెరిగింది. దీంతో ముందుగా అనుకున్నట్లు కాక మరిన్ని హంగులతో ‘సాహో’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ నిర్ణయించుకున్నారు. ఈ కారణాల వల్ల ఆటోమేటిక్‌గా ‘సాహో’ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. సుజీత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్‌ నాయికగా నటిస్తున్నారు. అరుణ్‌ విజయ్, నీల్‌ నితిన్‌ ముఖేష్, ఎవెలిన్‌ శర్మ, లాల్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అంటే ‘బాహుబలి–2’ రిలీజైన ఏప్రిల్‌ లాస్ట్‌ వీక్‌లో రిలీజ్‌ అవుతుందని టాక్‌. కొందరు ‘సాహో’ రాక ఆగస్టులో అని కూడా అంటున్నారు. మరి.. సాహో రిలీజ్‌ ఎప్పుడో?

వెంకటేష్‌: పంచ్‌ మిస్‌
పోయిన ఏడాది మార్చిలో బాక్సింగ్‌ గురుగా ‘గురు’ సినిమాలో ఆకట్టుకున్న వెంకటేశ్‌ 2018ని మిస్సయినట్టే లెక్క.  ప్రస్తుతం ఆయన ‘ఎఫ్‌ 2’, ‘వెంకీ మామ’ సినిమాల్లో నటిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో  వరుణ్‌ తేజ్‌తో కలిసి నటిస్తున్న ‘ఎఫ్‌2’ను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నట్లు  నిర్మాత ‘దిల్‌’ రాజు ఆల్రెడీ ప్రకటించారు. బాబీ డైరెక్షన్‌లో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా రూపొందుతోన్న ‘వెంకీ మామా’ ఈ నెలలోనే ప్రారంభమైంది కనుక ఈ బొమ్మ కూడా ఈ ఏడాది థియేటర్స్‌లో పడదు. ఇక వెంకటేష్‌ సోలో హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందాల్సిన సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ఇలా వెంకీ ఈ ఏడాది వెండితెరపై కనిపించే చాన్స్‌ లేకుండాపోయింది.

రానా: రావా
‘ఘాజీ’, ‘బాహుబలి–2’, ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలతో గతేడాది సిల్వర్‌స్క్రీన్‌పై సందడి చేసిన రానా స్పీడ్‌ పెంచి ‘1945’ (తమిళంలో మడైతిరందు), ‘హాథీ మేరీ సాథీ’, ‘ఐందామ్‌ తిరునాళ్‌ మార్తాండ వర్మ: ద కింగ్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌’, కోడి రామ్మూర్తి బయోపిక్, ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కానీ ఈ లిస్ట్‌లో ఏ సినిమా కూడా ఈ ఏడాది థియేటర్స్‌లోకి వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. ‘హాథీ మేరీ సాథీ’  ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ కానుందన్న వార్తలు వచ్చాయి. కానీ వచ్చే ఏడాదికి వాయిదా పడిందట. ఎక్కువ సినిమాలకు రానా డేట్స్‌ ఇవ్వడమే ఇందుకు కారణం అని ఊహించవచ్చు. అయితే ఇక్కడ కనిపించకపోయినా ఈ ఏడాది రానా బాలీవుడ్‌లో ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’ సినిమాలో  గెస్ట్‌ రోల్‌లో కనిపించారు. తమిళంలో త్వరలో రిలీజ్‌ కానున్న ‘ఎన్నై నోక్కిపాయుమ్‌ తోట్టా’లో కూడా గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారు. సో.. ఈ ఏడాది అతిథిగా వేరే భాషల్లో కనిపించినా తెలుగును మాత్రం మిస్సయినట్టే.

రకుల్‌: నో చాన్స్‌
ఇంట్లో కన్నా ఎయిర్‌పోర్ట్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్న రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తమిళంలో మూడు (సూర్య ‘ఎన్‌జీకే’, కార్తీ ‘దేవ్‌’, శివకార్తీకేయన్‌ సినిమాలు), హిందీలో ఒకటి (అజయ్‌దేవగన్‌), తెలుగులో రెండు (వెంకీ మామా, ఎన్టీఆర్‌ బయోపిక్‌) సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాల కోసం చెన్నై, హైదరాబాద్, ముంబైల మధ్య చెక్కర్లు కొడుతున్న ఈ బ్యూటీ ఈ ఏడాది డైరెక్ట్‌గా ఒక్క తెలుగు సినిమాలో కూడా కనిపించకపోవడం ఫ్యాన్స్‌ని నిరాశపరిచే విషయం.  రకుల్‌ తెలుగులో నటిస్తున్న ‘వెంకీ మామా’, ఎన్టీఆర్‌ బయోపిక్‌లు ఈ ఏడాది విడుదల కావు. అయితే తమిళంలో కార్తీ సరసన ఆమె నటిస్తోన్న ‘దేవ్‌’ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుందన్న వార్తలు  వినిపిస్తున్నాయి.  కార్తీ నటించే అన్ని తమిళ సినిమాలూ తెలుగులో విడుదల అవుతాయి కనుక ఆ డబ్బింగ్‌తో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే డిసెంబర్‌లో చాలా తెలుగు సినిమాలు రిలీజ్‌ కానుండడం వల్ల కార్తీ సినిమాకు చాన్స్‌ లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఏతావాతా ఈ ఏడాదంతా రకుల్‌ కనిపించకపోవడం అభిమానులకు నిరాశే.

హిందీలోనూ అంతే
తెలుగులో కొందరు స్టార్స్‌ 2018ని మిస్సవుతున్నట్టే హిందీలో కూడా మిస్‌ కానున్నారు. కంగనా రనౌత్‌ ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఈమె లీడ్‌ రోల్‌ చేసిన ‘మణికర్ణిక’  పూర్తయి చాన్నాళ్లు అయినా స్క్రీన్‌ మీదకు రావడం లేదు. పోయిన ఏడాదే ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ థియేటర్స్‌లోకి రాలేదు. ఆగస్టు 15,  దసరా, దీపావళి ఇలా ఏదో ఒక సందర్భాన్ని మేకర్స్‌ వినియోగించుకుంటారన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ 15న మోషన్‌ పోస్టర్‌ని మాత్రం రిలీజ్‌ చేయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్‌డే సందర్భంగా జనవరిలో రిలీజ్‌ కానుందని బీ టౌన్‌ టాక్‌. అలాగే ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వంలో కంగనా, రాజ్‌కుమార్‌ రావ్‌ ముఖ్య తారలుగా రూపొందిన ‘మెంటల్‌ హై క్యా’ రిలీజ్‌ కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే. అలాగే హృతిక్‌ రోషన్‌ కూడా ఈ ఏడాది మిస్‌ అవనున్నారు.  గతేడాది ‘కాబిల్‌’తో  వచ్చిన హృతిక్‌ ‘సూపర్‌ 30’ సినిమాతో లెక్కల మాస్టారుగా రెడీ అయ్యి నవంబర్‌ థర్డ్‌ వీక్‌లో రావడానికి సిద్ధమయ్యారు. కానీ రిలీజ్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
- ఇన్‌పుట్స్‌: ముసిమి శివాంజనేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement