రానా ఆ అవకాశం ఇస్తాడో... లేదో?!
‘‘నాకు సిగ్గు ఎక్కువ. ‘పెళ్లి చూపులు’ అంటే మా స్నేహితుడి ఇంటికి అమ్మాయిని రమ్మని చెప్పాను. రమ్మన్నానే కానీ మాట్లాడాలంటే మొహమాటం. తను రావడం.. నేను మాట్లాడకపోవడం.. మూడు రోజులూ ఇదే తంతు. కనీసం హలో.. కూడా చెప్పలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. ఇప్పుడలా కాదు, పరిస్థితులు చాలా మారాయ్’’ అన్నారు నిర్మాత డి.సురేశ్ బాబు. ఆయన సమర్పణలో విజయ్ దేవరకొండ, రితూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన సినిమా ‘పెళ్లి చూపులు’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా సురేశ్ బాబు చెప్పిన సంగతులు...
♦ విద్యావంతులు ఎక్కువ కావడం, ఎకనమిక్ ఇండిపెండెన్స్ పెరగడంతో ఈరోజుల్లో ‘పెళ్లి చూపులు’ చూసేవారి సంఖ్య తగ్గుతోంది. ‘కులం, ఆర్థిక స్థితి’ చూసి చాలా ప్లాన్డ్‌గా లవ్ చేసే యువత కొందరయితే.. మరికొందరు సహజంగా ప్రేమలో పడుతున్నారు.
♦ దర్శకుడు తరుణ్‌భాస్కర్ ఈ కథను ముందు నాకే చెప్పాడు. క్రమశిక్షణ గల ఓ అమ్మాయి, బద్ధకస్తుడైన అబ్బాయికి ‘పెళ్లి చూపులు’. ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. ఇద్దరూ తమ గతం గురించి చెప్పుకోవడం మొదలుపెడతారు. అదీ సినిమా. రాజ్ కందుకూరి ఈ కథ గురించి చెప్పగానే.. మంచిదని సలహా ఇచ్చాను.
♦ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత హ్యాపీ ఫీలయ్యా. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని విభిన్నంగా తీర్చిదిద్దాడు. నాకు ఏ కథనైతే చెప్పాడో.. దాన్నే తెరపై చూపించాడు. బౌండ్ స్క్రిప్ట్, స్టోరీ బోర్డ్, సింక్ సౌండ్.. అన్నిటికీ మించి అనుకున్న బడ్జెట్‌లో ఫర్‌ఫెక్ట్‌గా తీశాడు. సినిమా తీసిన విధానం నాకు నచ్చడంతో భాగస్వామినయ్యా. తరుణ్ భాస్కర్‌తో మా సంస్థలో ఓ సినిమా నిర్మించడానికి రెడీ అయ్యాను. రెండు మూడు ఐడియాలు చెప్పాడు.
♦ మా సంస్థలో సినిమా నిర్మించి ఏడాదిన్నర కావొస్తోంది. కథ విషయంలో నేను చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. ఏ సినిమా పడితే అది తీస్తే.. డబ్బులు పోతాయేమో? పరువు పోతుందేమోనని నాకు భయం ఎక్కువ. వెంకటేశ్, రానా, నాగ చైతన్యలతో ఒక్కో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాను. వెంకీ, రానాలతో మల్టీస్టారర్ కూడా ప్లానింగ్‌లో ఉంది. అన్నీ కథాచర్చల్లో ఉన్నాయి.
♦ రెండేళ్లలో రానా పెళ్లి చేయాలనుకుంటున్నాం. పెళ్లి చూపులు ఏర్పాటు చేసే అవకాశం ఇస్తాడో! ప్రేమించానంటూ తనే ఓ అమ్మాయిని తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తాడో (నవ్వుతూ).