సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే ఓ హాట్ కేక్. సినిమా స్టార్ట్ కాకముందే బిజినెస్ క్లోజ్ అయిపోయేంత క్రేజ్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ...
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే ఓ హాట్ కేక్. సినిమా స్టార్ట్ కాకముందే బిజినెస్ క్లోజ్ అయిపోయేంత క్రేజ్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ... ఇలా అన్ని భాషల్లోనూ ఆయనకు బోల్డంత మార్కెట్ ఉంది. వీటికి తోడు ఓవర్సీస్‌లోనూ రజనీ సినిమాలు కనకవర్షం కురిపిస్తాయి. సో... టర్నోవర్ భారీ స్థాయిలో ఉంటుంది. అలాంటప్పుడు రజనీకాంత్ పారితోషికం ఎంత భారీగా ఉండాలి? ఆ భారీ పారితోషికం వింటే ఎవరికైనా చుక్కలు కనిపిస్తాయి. ఓ ప్రముఖ తమిళ పత్రిక ఇటీవల పలువురు ప్రముఖ తమిళ హీరోలు ఎంతెంత పారితోషికం తీసుకుంటున్నారో ఓ కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం సూపర్‌స్టార్ తీసుకుంటున్నది ‘46 కోట్లు’ అని సమాచారం.
‘రోబో’ చిత్రానికి రజనీ 23 కోట్లు తీసుకున్నారట. త్వరలో విడుదల కానున్న ‘కోచడయాన్’ చిత్రానికి లాభాల్లో వాటా తీసుకోనున్నారట. తదుపరి చిత్రాన్ని ఓ ప్రముఖ సంస్థలో చేయబోతున్నారట రజనీ. ఆ సంస్థ అధినేత రజనీకీ 46 కోట్లు పారితోషికం ఇవ్వడానికి సిద్ధపడ్డారని సమాచారం. రజనీలానే కమల్‌కి కూడా దక్షిణ, ఉత్తరాది భాషలతో పాటు ఓవర్సీస్లోనూ మంచి మార్కెట్ ఉంది. అలాగే, అజిత్, విజయ్, సూర్య, విక్రమ్‌వంటి ఇతర కోలీవుడ్ హీరోల చిత్రాలకు అటు తమిళ్, తెలుగుతో పాటు ఓవర్సీస్లోనూ మంచి మార్కెట్ ఉంది. ఆ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని కోట్లు ‘కోట్’ చేస్తున్నారు ఈ హీరోలు ఇక.. ఏయే హీరో ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసుకుందాం...
రజనీ తర్వాత కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో కమల్ అని సమాచారం. ‘దశావతారం’కి ఆయన 10 కోట్లు తీసుకున్నారట. ‘విశ్వరూపం’తో కమల్ మార్కెట్ భారీగా పెరగడంతో, ఆయన పారితోషికం 25 కోట్లకు చేరిందని వినికిడి. ఇక, నేటి తరం హీరోల్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలుగా అజిత్, విజయ్ మొదటి స్థానంలో ఉన్నారు. ‘బిల్లా 2’కి 12 కోట్లు తీసుకున్న అజిత్, ప్రస్తుతం శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి 18 కోట్లు తీసుకుంటున్నారట. విజయ్ కూడా ఇదే పారితోషికం తీసుకుంటున్నారని వినికిడి. ‘తుపాకీ’ చిత్రానికి 11 కోట్లు, ‘తలైవా’కి 14, ‘జిల్లా’కి 16 కోట్లు పారితోషికం తీసుకున్నారట విజయ్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న తాజా సినిమాకి విజయ్ తీసుకుంటున్న పారితోషికం 18 కోట్లు అట. ఈ ఇద్దరి హీరోలకన్నా ఓ ఐదు కోట్లు ఎక్కువే కోట్ చేస్తున్నారట సూర్య. ఈ ‘గజిని’ ఫేం తీసుకుంటున్న పారితోషికం 23 కోట్లు అని కోలీవుడ్ టాక్. 7 కోట్లు పారితోషికం, 16 కోట్లు తెలుగు అనువాద హక్కుల నిమిత్తం సూర్య ఈ పారితోషికం తీసుకుంటున్నారట. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరో విక్రమ్.
‘అపరిచితుడు’తో ఉత్తరాదిన కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న విక్రమ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఐ’ చిత్రానికిగాను 11 కోట్లు తీసుకున్నారని సమాచారం. ఈ చిత్రం తెలుగులో ‘మనోహరుడు’గా విడుదల కానుంది. యువతరం హీరోల్లో పోటీపోటీగా సినిమాలు చేస్తున్న శింబు, ధనుష్ 7 కోట్లు తీసుకుంటున్నారట. తన అన్నయ్య సూర్యలానే తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కార్తీ తెలుగులో అనువాద హక్కులకు 7 కోట్లు, పారితోషికం 6 కోట్లుతో కలిపి మొత్తం 13 కోట్లు ఇంటికి తీసుకెళుతున్నారట. విశాల్ కూడా ఈ రెండు భాషలకూ దగ్గరయ్యారు కాబట్టి, 3 కోట్లు అనువాద హక్కులు, 5 కోట్లు పారితోషికంతో కలిపి, మొత్తం 8 కోట్లు తీసుకుంటు న్నారట. ఇంకా, ఆర్య, ‘జయం’ రవి నాలుగున్నర కోట్లు, జీవా ఆరు కోట్లు తీసుకుంటున్నారని సమాచారం.