గోల గోల కామిక్స్‌ | Trying to create our own universe, says Rohit Shetty | Sakshi
Sakshi News home page

గోల గోల కామిక్స్‌

Published Tue, May 14 2019 12:00 AM | Last Updated on Tue, May 14 2019 12:00 AM

Trying to create our own universe, says Rohit Shetty - Sakshi

తన ‘గోల్‌మాల్‌’ సిరీస్‌ సినిమాలలో హిట్టయిన పాత్రలను తీసుకుని దర్శకుడు రోహిత్‌ షెట్టి సోనిక్‌ చానల్‌లో ‘గోల్‌మాల్‌ జూనియర్స్‌’ కామిక్స్‌ని పిల్లల కోసం సిద్ధం చేశారు. 

పరిగెత్తే చిత్రాలకి నిలబడే చిత్రాలకి తేడా అదే.నిలబడే చిత్రాలు నిలిచిపోతాయి.మనసపై ముద్రించుకుపోతాయి.పిల్లలకు మంచి సందేశాన్నిస్తాయి. ఉత్సాహాన్ని నింపుతాయి.అవును. నిలబడే చిత్రాలు పిల్లల మనసులను పరిగెత్తిస్తాయి.

రజనీకాంత్‌కు చిన్నపిల్లలు ఫ్యాన్స్‌గా ఉండొచ్చు. సల్మాన్‌ ఖాన్‌కు చిన్నపిల్లలు ఫ్యాన్స్‌గా ఉండొచ్చు. కాని ఒక డైరెక్టర్‌కు పిల్లలు ఫ్యాన్స్‌గా ఉండటం కిడ్స్‌ పేజీలో రావాల్సిన న్యూసే. డైరెక్టర్‌ రోహిత్‌ షెట్టి తీసిన కామెడీ సిరీస్‌ ‘గోల్‌మాల్‌ ఫన్‌ అన్‌లిమిటెడ్‌’, ‘గోల్‌మాల్‌ రిటర్న్స్‌’, ‘గోల్‌ మాల్‌ 3’, ‘గోల్‌మాల్‌ అగైన్‌’ భారీ హిట్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత టీవీలో పదే పదే ప్రసారం అవుతూ పిల్లలు ఎంజాయ్‌ చేసే సినిమాలుగా మారాయి. ఈ సిరీసే కాదు రోహిత్‌ షెట్టి తీసిన ‘సింగమ్‌’, ‘సింగమ్‌ రిటర్న్స్‌’ సినిమాలు కూడా కాప్‌ మూవీస్‌గా పిల్లలకు బాగా నచ్చాయి. దాంతో ఈ సినిమాలను పిల్లలకు మరింత దగ్గర చేయడానికి వీటి ఆధారంగా కామిక్స్‌గా తయారవుతున్నాయి. గత సంవత్సరం ‘లిటిల్‌ సింగమ్‌’ పేరుతో ఒక కామిక్‌ సిరీస్‌ ‘డిస్కవరీ కిడ్స్‌’లో మొదలయ్యి బాల సింగమ్‌ చేసే సాహసాలతో పిల్లలను ఆకట్టుకుంది. ఇప్పుడు ‘గోల్‌మాల్‌’ సిరిస్‌లోని పాత్రలతో ‘గోల్‌మాల్‌ జూనియర్‌’ కామిక్‌ సిరీస్‌ నిక్‌లోడియన్‌ గ్రూప్‌కు చెందిన ‘సోనిక్‌ చానెల్‌’లో ఈ నెల 13 నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా పిల్లల గురించి, రాబోయే సినిమాల గురించి రోహిత్‌ శెట్టి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

∙మీ సినిమాలలో స్టంట్స్‌ ఫేమస్‌. ఇవి పిల్లలను దృష్టిలో పెట్టుకునే ప్లాన్‌ చేస్తారా?
రోహిత్‌: ఫైట్స్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? మనం కూడా మన చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకుంటే అట్ట కత్తులతో బొమ్మ తుపాకులతో ఫైట్‌ చేసే ఆటలే ఆడుకుని ఉంటాం. అదీ గాక మా నాన్న ఎం.బి.శెట్టి పెద్ద స్టంట్‌ డైరెక్టర్‌. అందువల్ల కూడా నాకు స్టంట్స్‌ అంటే ఇష్టం ఏర్పడి ఉంటుంది.

∙మీ ఫైట్స్‌ సైన్స్‌ సూత్రాలు పాటించవు. గాల్లో కార్లు ఎలా ఎగురుతాయి?
ఆకాశంలో ఎగరాల్సిన విమాన కంపెనీలు మూత పడుతున్నాయి (చిన్న నవ్వు). కనీసం కార్లైనా ఎగరనివ్వండి. ఏమో... ఇంకో పది పన్నెండేళ్లకు నిజంగానే ఎగిరే కార్లు రావని గ్యారంటీ ఏమిటీ. అప్పుడు అందరూ నన్నే తలుచుకుంటారు.

∙మీ బాల్యం గురించి చెప్పండి?
మా నాన్నగారికి మా అమ్మ రత్నా శెట్టి రెండో భార్య. నా ఎనిమిదేళ్ల వయసులోనే మా నాన్న చనిపోయారు. అప్పటికి ఆయన వయసు యాభై కూడా ఉండదు. ఆయన జీవించి ఉండగా చాలా ఫేమస్‌. సౌత్‌ సినిమాలలో చాలా వాటిల్లో నటించారు (ఎన్‌.టి.ఆర్‌ ‘డ్రైవర్‌ రాముడు’లో బొర్రాగుహల ఫైట్‌ సీన్‌లో ఎం.బి.శెట్టి నటించారు). అయితే ఆయన చనిపోవడంతో అమ్మ సింగిల్‌ మదర్‌గా నన్ను పెంచింది. ఆమె చాలా ధైర్యమున్న స్త్రీ. నా ప్రతి జీవిత సందర్భంలో ఆమెను చూసే  ధైర్యం తెచ్చుకున్నాను. ఆమె ఈ రోజుకీ నాతోనే ఉంటోంది. బయట ఎన్ని చికాకులు ఎదురై ఇంటికి వెళ్లినా అమ్మను చూడగానే అమ్మయ్య... అమ్మ ఉంది కదా అనే ధైర్యం వచ్చేస్తుంటుంది. చేసే పని ఏదైనా దానిని నిజాయితీతో చేయాలి అని ఆమె నూరిపోసిన విలువను గట్టిగా పాటిస్తాను. ఆమె కూడా నాన్నతోనే స్టంట్‌ ఉమన్‌గా పని చేసింది. కనుక నా మీద సినిమా ప్రభావం అనివార్యంగా పడింది. నేను ముందు నుంచి సినిమా రంగంలో పని చేయాలని అనుకున్నాను. నా పదిహేడవ ఏటే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మారాను. ముప్పయ్యవ ఏట డైరెక్టర్‌ అయ్యాను.

∙మీ గోల్‌మాల్‌ సిరీస్‌లోని పాత్రలు ఇప్పుడు కామిక్‌ క్యారెక్టర్స్‌ మారేంత ఫేమస్‌ అయ్యాయి...
అవును. ఇది నాకు చాలా సంతోషాన్నిస్తోంది. గోల్‌మాల్‌ తీస్తున్నప్పుడు ఇది మొదట పిల్లలకు నచ్చాలి అనుకున్నాను. పిల్లలకు నచ్చితే వారే తల్లిదండ్రులను థియేటర్‌కు తీసుకుని వస్తారు. పిల్లలు చూస్తారు కనుక నా సినిమాల్లో అశ్లీలత కనిపించకుండా జాగ్రత్త పడతాను. గోల్‌మాల్‌ సిరిస్‌లో అజయ్‌ దేవగణ్‌ వేసిన గోపాల్‌ పాత్ర, తుషార్‌ కపూర్‌ వేసిన లక్కీ పాత్ర, అర్షద్‌ వర్సీ వేసిన మాధవ్‌ పాత్ర, షర్మన్‌ జోషి వేసిన లక్ష్మణ్‌ పాత్ర ఇవి పిల్లలకు నచ్చాయి. నికొలొడియన్‌ సంస్థ నా సంస్థతో కలిసి ఈ క్యారెక్టర్స్‌తో కామిక్స్‌ చేద్దామని అన్నప్పుడు సంతోషంగా అంగీకరించాను. సినిమాల్లో కేవలం మూడు గంటల పాటే వీరి అల్లరి ఉంటుంది. టీవీలో ఇక మీదట రోజూ ఉంటుంది. సోనిక్‌ చానల్‌లో మధ్యాహ్నం 1.30కు ఈ గోల్‌మాల్‌ జూనియర్‌ చూడవచ్చు.

∙గోల్‌మాల్‌లో తుషార్‌ వేసే మూగ పాత్ర చాలామంది పిల్లలకు ఇష్టమని గమనించారా?
తుషార్‌కు ఆ పాత్ర చాలా పేరు తెచ్చింది. అతడు మూగభాష మాట్లాడుతుంటే పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో దాని అర్థాన్ని షర్మన్‌ జోషి చెబుతుంటాడు. తుషార్‌ మూగవాడైనందుకు దిగులుగా చింతగా ఉండడు. ఎనర్జిటిక్‌గా ఉంటాడు. లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తుంటాడు. మనకు ఏవైనా లోపాలు ఉన్నా లైఫ్‌ను సరదాగా తీసుకుని ముందుకు సాగాలని పిల్లలు అనుకుంటే మంచిదే కదా.

∙మీ చిన్నప్పుడు మీకిష్టమైన కామిక్‌ క్యారెక్టర్‌ ఏది?
టిన్‌టిన్‌. అది చేసే అడ్వంచర్స్‌ చాలా ఇష్టపడేవాణ్ణి. కంటెంట్‌ వల్ల మాత్రమే కాదు ఆ కామిక్స్‌ క్వాలిటీ చాలా బాగుండేది. అందువల్ల కూడా ఇష్టపడేవాణ్ణి.

∙మీరు ‘సింగమ్‌ సిరిస్‌’ నుంచి ‘లిటిల్‌ సింగమ్‌’ కామిక్‌ క్యారెక్టర్‌ పుట్టించారు. ఆడపిల్లలు కూడా శక్తిమంతులే కదా. అబ్బాయిలేనా?
అక్కడికే రాబోతున్నాను. నా సింగం సినిమాల్లో సూపర్‌ కాప్‌గా అజయ్‌ దేవగణ్‌ కనిపిస్తారు. కాని నిజ జీవితంలో సూపర్‌ లేడీ కాప్స్‌ కూడా ఉంటారు. స్త్రీలు ఎందులోనూ తక్కువ కాదు. అందుకే లేడీ సూపర్‌ కాప్‌తో ఒక సినిమా చేయనున్నాను. అది కూడా కామిక్‌ క్యారెక్టర్‌గా మారితే ఆడపిల్లలను ఇన్‌స్పయిర్‌ చేయొచ్చు.

∙ఎవరా సూపర్‌ లేడీ కాప్‌. కరీనానా? కత్రీనానా?
ఇలాంటి ప్రశ్నలు వేసి రేపు నన్ను హెడ్‌లైన్స్‌లో ఇరికించకండీ. నేను కొంచెం స్మార్ట్‌. అప్పడే బయట పెట్టను (నవ్వుతూ).

∙నేటి పిల్లలు ఎలా ఉన్నారు?
నా కొడుక్కు ఇప్పుడు 13 సంవత్సరాలు. నా సినిమాలన్నీ బాగా ఎంజాయ్‌ చేస్తాడు. పిల్లలు
హోమ్‌ వర్కు, హాబీ క్లాసు, గోల్డ్‌ మెడలు, టాప్‌ ర్యాంక్‌ వీటి చుట్టూ తిరుగుతున్నారు. వాటికి ఎంత విలువ ఇవ్వాలి పిల్లలు ఎంత రిలాక్స్‌ అవ్వాలి అనేది మనం ఆలోచించాలి. సమ్మర్‌ హాలిడేస్‌లో కూడా వారిని ఆడుకోనివ్వకుండా చదివించడం సరైనది కాదు. అందుకే అవన్నీ మర్చిపోండి... హాయిగా రోజులో కాసేపైనా మీకు నచ్చిన కామిక్స్‌ చూడండి అని చెప్పాలనిపిస్తుంది.

∙మీ జీవితం నుంచి వారికి ఏం చెప్తారు?
కష్టపడమని చెప్తాను. కష్టపడకుండా ఏదీ రాదు. పనిని లేదా చదువును ఎంజాయ్‌ చేయమని కూడా చెప్తాను. ఉదయాన్నే లేచి షూటింగ్‌కు వెళ్లడం నాకు ఇష్టం. ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. షూటింగ్‌ కోసం ఒక్కోసారి ఉదయం ఆరు గంటలకు బయలుదేరి వెళతాను. పనులు ముగిసే సరికి రాత్రి పన్నెండు కూడా కావచ్చు. కాని మళ్లీ తెల్లారి ఆరుగంటలకు అంతే ఉత్సాహంగా బయలుదేరుతాను. 2003లో నేను డైరెక్టర్‌ను అయితే నేటివరకు దాదాపు ఏ సంవత్సరంలోనూ నా సినిమా రిలీజ్‌ కాకుండా లేదు.  పని చేయడం బాగుంటుంది. పని చేయాలి.

∙మీ తాజా చిత్రం ‘సూర్యవంశీ’లో అక్షయ్‌ కుమార్‌ హీరో. అతనిపాత్ర సూపర్‌ కాప్‌. ‘అవెంజర్స్‌’ లాంటి పాత్రల ప్రభావం మీ మీద ఉందా?
లేదు. అవెంజర్స్‌తో పోలిక చాలా పెద్ద మాట. అది జోక్‌ అవుతుంది. నా సూపర్‌ హీరోలు లోకల్‌ హీరోలు. వాళ్లు కూడా చెడు మీద పోరాడతారు. వాళ్లు లోకల్‌గా ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తే చాలు. ప్రపంచాన్ని చేయక్కర్లేదు. నా ‘సూర్యవంశీ’లో అక్షయ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌కు హెడ్‌గా కనిపిస్తారు. వివరాలు మాత్రం 2020 మేలో వెండితెర మీద చూడండి.
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement