
ముంబై : నగరంలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన యూ2 ముంబై కన్సర్ట్ బాలీవుడ్ తారాగణంతో నిండిపోయింది. ఐరిష్ రాక్ బ్యాండ్ ‘ది జోషువా ట్రీ టూర్’లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ వారి ఇద్దరి పిల్లలతో కలిసి సందడి చేశారు. విడాకులు తీసుకున్న తర్వాత హృతిక్, సుసానే ఫ్రెండ్స్‌గా కొనసాగుతుండటం విశేషం. ఐరిష్ రాక్ బ్యాండ్ పాటగాళ్లతో దిగ్గజ మ్యూజీషియన్ ఏఆర్ రెహమాన్ వేదికను పంచుకున్నారు. తన కూతుళ్లు ఖతీజా, రహీమాతో కలిసి ‘అహింస’ పాట పాడి ఆహూతులను అలరించారు.
ఇక ఈ కార్యక్రమంలో భార్య అంజలితో కలిసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొన్నారు. దీపిక-రణ్‌వీర్ జోడి సరికొత్త దుస్తుల్లో కార్యక్రమానికి హాజరయ్యారు. బైకర్ షార్ట్స్‌లో దీపిక.. బ్లాక్ టీషర్ట్, రెడ్ ప్యాంట్‌లో కన్సర్ట్‌కు వచ్చిన రణ్‌వీర్ జంట చేతులో చేయి వేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. కునాల్ కపూర్, అతని భార్య నైనా బచ్చన్ (అభిషేక్ బచ్చన్ కజిన్), మీరా రాజ్‌పుత్, డయానా పెంటీ, అలియాభట్ చెల్లెలు షహీన్ భట్ యూ2 ముంబైలో పాల్గొన్నారు.



