
తాజాగా రెండోసారిమానసికరోగిలా నటించిన వైనం
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా దూసుకుపోతున్న మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్‌కు కళ్లెంవేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా అని అనుమానించేట్లుగా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో కమల్ ఇంట్లోకి అగంతకులు చొరబడడం వెనుక ప్రతిపక్ష రాజకీయశక్తులు ఉన్నాయా అనే సందేహాలకు తెరలేచింది. సినీరంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన అనేక వెండితెర వేల్పుల వరుసలో నటులు రజనీకాంత్, కమలహాసన్ కూడా నిలిచారు. రజనీ రాజకీయం మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. ఇక కమలహాసన్ ఎంఎన్‌ఎంను స్థాపించి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కేంద్రం లోని బీజేపీని, రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాలను తన విమర్శలతో కమల్ తూర్పారపడుతున్నారు. కమల్ విమర్శలు అధికార పార్టీ నేతలను అనేకసార్లు అగ్రహానికి గురిచేసింది. హెచ్చరికలను సైతం చేశారు. అయితే ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని కమల్ పదేపదే చెబుతూనే ఉన్నారు.
చొరబాటు..పొరపాటేనా: చెన్నై ఆళ్వార్‌పేట ఎల్డామ్స్‌రోడ్డులో కొన్ని దశాబ్దాలుగా కమల్ కాపురం ఉంటున్నారు. అత్యంత రద్దీగా ఉండే అళ్వార్‌పేట సిగ్నల్ కూడలిలోని ఆ ఇంట్లోకి చొరబడడం అంత సులువుకాదు. నటనకే పరిమితమైన రోజుల్లో కమల్ ఇంట్లో ఇలా ఎవ్వరూ అనధికారికంగా ప్రవేశించిన సందర్భాలు లేవు. అయితే రాజకీయాల్లో అడుగుపెట్టిన తరువాత ఆళ్వారుపేట ఇంట్లోని ఒక భాగాన్ని ఎంఎన్‌ఎం ప్రధాన కార్యాలయంగా మార్చివేశారు. పార్టీ కార్యక్రమాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇక పూర్తి స్థాయి రాజకీయనాయకునిగా మారుతానని కమల్ ప్రకటించారు.
ఈ దశలో రెండు నెలల క్రితం ఒకరు సెక్యూరిటీ కళ్లుగప్పి లోనికి ప్రవేశించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మంగళవారం తెల్ల్లవారుజామున మరో వ్యక్తి కమల్ ఇంట్లోకి ప్రవేశించి దొరికిపోయాడు. తెల్లవారుజాము 3.30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చి తనను కమల్ రమ్మన్నాడని సెక్యూరిటీకి చెప్పాడు.
అయితే వారు లోనికి అనుమతించలేదు. దీంతో సెక్యూరిటీ కళ్లుగప్పి ఇనుపగేటుపై నుంచి లోనికి దూకి ఇంట్లోకి చొరబడిపోయాడు. సెక్యూరీటీ రావడంతో అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. సెక్యూరిటీ వెళ్లమని కోరగానే అదే సోఫాలో పడుకున్నాడు. కమల్ రమ్మన్నాడని కొంతసేపు, కమల్‌ను కలిస్తేగానే వెళ్లనని మరోసారి అన్నాడు. తాను పార్టీ కార్యకర్తను, కమల్ అభిమానని రకరకాలుగా మాట్లాడాడు. సెక్యూరిటీ గార్డులకు అతడు లొంగకపోవడంతో తేనాంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. చెన్నై పురసవాక్కంలో ఉంటున్న రామనాధపురం జిల్లాకు చెందిన మలైస్వామి (34)గా గుర్తించారు. తాను కమల్ వీరాభిమానిగా ఆయనను చూసేందుకు వచ్చానని పోలీసులకు తెలిపాడు. మరో రెండురోజులపాటు అతడిని విచారించి జైల్లో పెట్టనున్నట్లు సమాచారం.