
మెగా-నందమూరి మల్టీస్టారర్..?
మెగా, నందమూరి హీరోల కాంబినేషన్లో త్వరలో ఓ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. ఇటు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి, అటు నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది స్టార్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో మల్టీస్టారర్ రాలేదు. తాజాగా నందమూరి కల్యాణ్ రామ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్లు కలిసి ఓ సినిమాలో నటించనున్నారని టాక్. స్వయంగా కల్యాణ్ రామే.. ధరమ్ తేజ్ పేరుని సూచించారని తెలుస్తోంది. ధరమ్ తేజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్టు పట్టాలకెక్కే అవకాశాలున్నట్లు సమాచారం.
ఏ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఇద్దరు వేరు వేరు సినిమాల షూటింగుల్లో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్టులు పూర్తవ్వగానే ఈ మల్టీస్టారర్ను మొదలుపెట్టాలని చూస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.1981లో ఎన్టీఆర్, చిరంజీవిలు కలిసి నటించిన 'తిరుగులేని మనిషి' సినిమా తర్వాత.. ఇన్నాళ్లకు ఇరు కుటుంబాలకు చెందిన తారలు ఒకే సినిమాలో కనిపించడం ఇదే తొలిసారి అవుతుంది.