నాలుగు భాషల్లో వకుడు పాండియర్‌గళ్
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం తదితర నాలుగు భాషల్లో వకుడు పాండియర్‌గళ్ అనే చిత్రం తెరకెక్కుతోంది. సినీ నిలయ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి పతాకంపై పి.వి.శ్రీరామ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు చంద్రమహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన తెలుగులో ప్రేయసిరావే వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నంది అవార్డు గ్రహీత అయిన చంద్రసిద్ధార్థ్ ఈ చిత్రం ద్వారా తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో పరిచయమవుతున్నారు. మహదేవ్, కృష్ణ, అమర్, తేజ మొదలగు నలుగురు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజనామీనన్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు.
పాండియరాజన్, గంజాకరుప్పు, యోగిబాబు, మధుమిత్ర, సుమన్, టెలిఫోన్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ దర్శక, నిర్మాత కె.భాగ్యరాజ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఇటీవల చెన్నైలో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ వినాయక చతుర్ధశి వేడుకలను చెన్నైలో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, అదే సమయంలో నలుగురు యువకులు చెన్నై సముద్రతీరం మెరీనాబీచ్‌ను చూడటానికి వస్తారని తెలిపారు.
అలాంటి సమయంలో కొందరు ఉగ్రవాదులు వినాయక చవితి ఉత్సవాల్లో కల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తారన్నారు. వారి ప్రయత్నం ఫలించిందా? మెరీనా తీర పర్యటనకు వచ్చిన వారేమయ్యారు? వంటి పలు ఆసక్తికర సంఘటనల సమాహారమే వకుడు పాండియర్‌గళ్ చిత్ర ఇతివృత్తంగా తెలిపారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు.