చిత్రపరిశ్రమలోని వారు తనంటే భయపడుతున్నారు అంటోంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్. ఈ అమ్మడిని సినీరంగంలో ఈ తరం డేరింగ్ లేడీ అని చెప్పవచ్చు. తన మనసుకు అనిపించింది ధైర్యంగా చెబుతూ భావ స్వేచ్ఛను బాగా వాడుకుంటున్న నటి వరలక్ష్మీశరత్‌కుమార్. నటిగా హీరోయిన్ పాత్రలనే చేస్తానని అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా ఎలాంటి పాత్రనైనా చాలెంజ్‌గా తీసుకుని ఆల్‌రౌండర్ నటిగా పేరు తెచ్చుకుంటోంది.
ప్రస్తుతం వరలక్ష్మి నటిస్తున్న చిత్రాల్లో విలనిజం ప్రదర్శించే చిత్రాలు చోటుచేసుకున్నాయి. అలాంటి వాటిలో పందెంకోడి 2 ఒకటి. విశాల్ హీరోగా నటించి తన నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో కీర్తీసురేశ్ హీరోయిన్‌గా నటించగా వరలక్ష్మీశరత్‌కుమార్ ప్రతినాయకి పాత్రను పోషించింది. ఈ పాత్రను ఆమె అదరగొట్టిందంటున్నారు.
ఈ చిత్రం ద్వారా ఈ సంచలన నటి టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. పందెంకోడి 2 చిత్రం తనకు చాలా ముఖ్యమైనదంటున్న వరలక్ష్మీశరత్‌కుమార్ తాజాగా దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న మీటూ గురించి స్పందిస్తూ దీని గురించి ఇప్పుడు జరుగుతున్న అవగాహన వంటి కార్యక్రమాన్ని తాను ఏడాది క్రితమే సేవ్ శక్తి పేరుతో ప్రారంభించానని చెప్పింది.
తాను ఎవరికీ భయపడనంది. ఏ విషయం గురించి అయినా తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెబుతానని అంది. అదే విధంగా తప్పు చేసిన వారు ఎవరైనా అందుకు తగిన శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొంది. అరబ్ దేశాల తరహాలో శిక్ష విధానాన్ని ఇక్కడ తీసుకొస్తే మహిళలపై జరిగే అత్యాచారాలు తగ్గుతాయని అంది.
ఇకపోతే తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయడం, తన ధైర్యం వంటి చర్యల కారణంగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేక మర్యాద, తనను చూస్తే భయం ఉందని భావిస్తున్నానని వరలక్ష్మి పేర్కొంది. ఇది తన నిజాయితీదక్కిన ఫలంగా భావిస్తానని ఈ జాణ అంటోంది. వరలక్ష్మి విలనిజం ప్రదర్శించిన పందెంకోడి 2 చిత్రం గురువారం విడుదల కానుంది.ఇక విజయ్‌తో ఢీ కొంటున్న సర్కార్ చిత్రం దీపావళి పండగకు పేలనుంది. ఇవి కాకుండా మరో అరడజను వరకూ చిత్రాలు వరలక్ష్మీ చేతిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment