
నటుడు విశాల్ బుధవారం చెన్నై, ఎగ్మూర్ కోర్టుకు హాజరయ్యారు. సేవా పన్ను శాఖ ఆధికారులు నటుడు విశాల్ కోటి రూపాయల వరకూ సేవా పన్ను చెల్లించని కారణంగా 2016 ఆయనకు సమన్లు పంపారు. ఈ విషయమై విశాల్‌ను నేరుగా సేవా పన్ను శాఖ కార్యాలయానికి హాజరు కావలసిందిగా ఆదేశించారు. విశాల్ హాజరు కాలేదు. ఆయన ఆడిటర్, న్యాయవాది మాత్రమే హాజరవుతున్నారు.
దీంతో సేవా పన్ను శాఖాధికారులు చెన్నై, ఎగ్మూర్‌లోని ఆర్థికశాఖా విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు బుధవారం కోర్టులో విచారణకు రావడంతో నటుడు విశాల్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. విశాల్ నటించి, నిర్మించిన సండైకోళి 2 (తెలుగులో పందెం కోడి 2) చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో విశాల్ కోర్టుకు హాజరవడం ఆయన అభిమానుల్ని కలవరపెట్టింది.
అయితే ఈ కేసు విషయంలో విశాల్ తరఫు న్యాయవాదులు ఏ.చార్లెస్ డావిన్, ఎస్.ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొంటూ బుధవారం నటుడు విశాల్ చెన్నై, ఎగ్మూర్ కోర్టుకు హాజరయ్యారని, అయితే అది ఫార్మాలిటీ కోసమేనని చెప్పారు. నిజానికి విశాల్ గత 12నే కోర్టుకు వచ్చి వివరణ ఇచ్చారన్నారు. సేవా పన్ను విషయంలో ఏమైనా చెల్లించాల్సి ఉంటే ఈ నెల 26న చెల్లిస్తామని కోర్టుకు చెప్పినట్లు విశాల్ తరపు న్యాయవాదులు తెలిపారు.