
చెన్నై : తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలు పోషిస్తూ తన నటనతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. క్యారెక్టర్ ఏదైనా ఒదిగిపోయి నటించడం వరలక్ష్మీ ప్రత్యేకత. 2012లో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన పోడాపోడి చిత్రంతో వరలక్ష్మీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో శింబుతో జతకట్టింది. గత ఎనిమిది సంవత్సరాలలో ఇప్పటికీ 25 చిత్రాల్లో నటించి గొప్ప ఘనతను సాధించింది. ఈ సందర్భంగా వరలక్ష్మీ తన స్నేహితులు, అభిమానులకు కృతజ్ఞత తెలుపుతూ ఓ లేఖ రాశారు.
‘ఎనిమిదేళ్ల ప్రయాణంలో నాతో కలిసి ఉన్న స్నేహితులు, అభిమానులకు కృతజ్ఞతలు. అలాగే నాకు వ్యతిరేకంగా ఉండి, నాపై చెడుగా, కించపరిచేలా మాట్లాడిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీ వ్యతిరేకత లేకుంటే నేను ఇంత ధ్యైర్యవంతురాలిని అయ్యుండే దానిని కాదు. అదే విధంగా మీ వాదనలు తప్పు అని నిరూపించలేకపోయేదాన్ని’ అని పేర్కొన్నారు. కాగా హీరో శరత్ కుమార్ మొదటి భార్య ఛాయ శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మీ. తన మనసులోని మాటలను నిర్మోహమాటంగా చెప్పే వరలక్ష్మీకి మంచి నటిగా పేరుంది.