సాక్షి, జూపాడుబంగ్లా: ‘నేసేవాడినంటున్నావు కాస్త మంచి బట్టలు కట్టుకొని రావొచ్చు కదా అంటే ఇళ్లు కట్టేవాడికి ఇళ్లుండదు, చెప్పులు కుట్టేవాడికి చెప్పులుండవు.. మాపరిస్థితి కూడా అంతే’నంటూ వేదం సినిమాలో చెప్పిన డైలాగ్‌తో పాపులర్ అయిన రాములు పాత్రదారి వేదంనాగయ్య నిజజీవితంలో కూడా అష్టకష్టాలు అనుభవించాడు. సినిమాలో నటించే ఏడుపు సీన్ల వెనుక నిజ జీవితంలో జరిగిన ఎన్నో ఘటనలను గుర్తుకు తెచ్చుకొంటే నిజంగానే ఏడుపువస్తుందంటున్నారు.
75 ఏళ్ల వయసులో కూడా చలాకీగా సినిమాల్లో నటిస్తూ కుటుంబపోషణలో తనవంతు పాత్ర పోషిస్తున్న వేదంనాగయ్య మంగళవారం పోతులపాడులో సినిమా షూటింగ్ సందర్భంగా ‘సాక్షి’తో మాట కలిపారు. తన ఊరు, పేరు సినిమా ప్రవేశంపై ఆయన మాటల్లోనే.. ‘మాది గుంటూరు జిల్లా, నర్సరావుపేట వద్ద దేసవరంపేట. నాకున్న రెండెకరాలు సాగు చేసుకుంటూ మిగతా సమయాల్లో కూలి పనులు వెళ్తుంటి. ఊరిలో పనులు లేకపోవడంతో కుమారుడి వెంట హైదరాబాదు వెళ్లాం. ఓ రోజు హైదరాబాదులో నడుచుకుంటూ వెళ్తుంటే ప్రొడ్యూజర్ రాధాకృష్ణ గారు చూసి సినిమాలో నటిస్తావా అని అడిగారు. కొడుకును అడిగి విషయం చెబుతానన్నా. ఇంటికెళ్లి మా వాడితో చెబితే ‘నీలాంటి వాళ్లు సినిమాలో నటించేందుకు చాలా మంది ఉంటారు.
నీకెవరు అవకాశం ఇస్తారు’ అన్నాడు. చివరికి ఏదోలాగా ఒప్పించి ప్రొడ్యూజర్ కార్యాలయానికి వెళ్లే పెద్ద డైలాగ్ చీటి ఇచ్చి నేర్చుకోవాలని చెప్పారు. మొత్తం కంఠస్తం పట్టి చెప్పడంతో వేదం సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి నాపేరు ముందు వేదం సినిమా పేరు చేరిపోయింది. వేదం, నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్ స్టార్, ఏమాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్ తదితర 25 సినిమాల్లో నటించాను. సినిమా తీసే కంపెనీని బట్టి రోజుకు రూ.3వేల నుంచి రూ.25వేల దాకా ఇస్తారు. అయినా కుటుంబాలు గడవటం కష్టంగా ఉంది. ఈ మధ్య ఆరోగ్యం బాగోలేక పోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. ‘మా’ అసోసియేషన్ వారు నెలకు రూ.2,500 పింఛన్ ఇస్తున్నారు.
‘తాతా మనవడు’తో మొదలెట్టా..
1500 సినిమాల్లో నటించి, పలు నాటకాలు రచించిన జీఎస్‌ఆర్. మ్మూర్తి అలియాస్ కవి కూడా సాక్షితో మాట్లాడారు. ఆయన మాటల్లోనే ‘మాది విజయనగరం జిల్లా, బజ్జిపేట మండలం, గంగాడ గ్రామం. ప్రస్తుతం కుటుంబసభ్యులతో హైదరాబాదులో ఉంటున్నా. 1972 నుంచి సినిమా రంగంలో ఉన్నా. తాతా మనుమడు సినిమాతో నా సినీ రంగ ప్రస్థానం మొదలైంది. ఇప్పటి వరకు 1500 సినిమాల్లో నటించాను. 70షీల్డులు అందుకున్న నేను సొంతిల్లు మాత్రం సంపాదించుకున్నా. ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ‘మా’ అసోసియేషన్ వారు సాయం చేస్తారు. ప్రస్తుతం నెలకు రూ.2,500 పింఛన్ ఇస్తున్నారు.
– జీఎస్‌ఆర్ మూర్తి ఆలియాస్ కవి
రైతుల దీనస్థితిపై సినిమా
అనంతపురం జిల్లా రైతుల దీనగాథను ‘విరంజి’ పేరుతో తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ వెంకటరాఘవన్ తెలిపారు. ఇందుకు సంబంధించి జూపాడు బంగ్లా మండలం పోతులపాడు, చాబోలు పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం డైరెక్టర్, యూనిట్‌సభ్యులు మీడియాతో మాట్లాడారు. హీరో ‘çస్కంద’ మాట్లాడుతూ.. రైతులు విత్తనాల కొనుగోలు నుంచి ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు అమ్ముకునే వరకు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కుటుంబాలు గడవక భార్యల పుస్తెలు తాకట్టుపెట్టి అప్పులు తీరుస్తున్నారని, అప్పటికీ తీరక ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, ఇలాంటి రైతు దీన గాథలను సినిమాలో చూపిస్తామన్నారు. హైదరాబాదు పరిసరాల్లో 90శాతం చిత్రీకరణ పూర్తయిందన్నారు. రవివర్మ, అప్పాజీ, ప్రీతినిగమ్(నటి), వేదం నాగయ్య, కవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారన్నారు. చాబోలుకు చెందిన ఓ వ్యక్తి కాటికాపరి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment