బాక్సర్ వెంకీ! | Venkatesh to play Madhavan's role in Telugu | Sakshi
Sakshi News home page

బాక్సర్ వెంకీ!

Published Tue, Jul 12 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

బాక్సర్ వెంకీ!

బాక్సర్ వెంకీ!

వెంకటేశ్ కామెడీ చేసినా బాగుంటుంది.. సీరియస్‌గా కనిపించినా సూట్ అవుతుంది. రొమాన్స్, సెంటిమెంట్.. ఇలా  అన్నీ చేయగలరు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులకీ దగ్గరయ్యారు వెంకీ. ప్రస్తుతం చేస్తున్న ‘బాబు బంగారం’లో ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్లు ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ చిత్రం తర్వాత చేయనున్న దాంట్లో మాత్రం వెంకీ సీరియస్‌గా కనిపించనున్నారు.
 
  ఇందులో బాక్సర్ పాత్ర చేయనున్నారు. ‘ఇరుది సుట్రు’, ‘సాలా ఖడూస్’ పేరుతో తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారు. ఒరిజినల్ మూవీలో మాధవన్ చేసిన బాక్సర్ క్యారెక్టర్‌ను ఆయన పోషించనున్నారు. తమిళ చిత్రాన్ని నిర్మించిన వైనాట్ స్టూడియోస్ తెలుగులోనూ నిర్మించనుంది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేశ్ బాబు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తారు.
 
 కథానాయకుడు ఎంతో టాలెంట్  ఉన్నా.. బాక్సింగ్ అసోసియేషన్‌లో ఉన్న రాజకీయాలతో ఛాంపియన్ కాలేకపోతాడు. బాక్సింగ్ కోచ్ గా మారి మట్టిలో మాణిక్యాల్లాంటి బాక్సర్లను వెలికితీయాలని ప్రయత్నాలు చేస్తాడు. రోడ్డు పక్కన చిన్న షాపు నడుపుకునే మది అనే అమ్మాయికి కోచింగ్ ఇచ్చి చాంపియన్‌ను చేస్తాడు. ఇలా సాగే ‘సాలా ఖడూస్’ కథకు తెలుగు నేటివిటీ జోడించి, మన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది దర్శకురాలు సుధా కొంగర ఆలోచన. బాక్సర్ క్యారెక్టర్ కోసం వెంకీ బాడీ ఫిట్‌నెస్ ఇంకాస్త  పెంచుతున్నారట.
 
  వెంకీ సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తారని ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి సురేశ్‌బాబు స్పందిస్తూ - ‘‘ఈ పాత్రకు సిక్స్‌ప్యాక్‌లో కనిపించాల్సిన అవసరం లేదు. బాక్సర్‌గా ఫిట్‌గా కనిపిస్తే చాలు’’ అన్నారు. ఈ సినిమా చిత్రీకరణ  మొత్తం విశాఖలో చేస్తార ని సమాచారం. సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మాతృకలో నటించిన రితికా సింగ్... తెలుగు రీమేక్‌లోనూ కనిపించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement