Venky Mama Review, in Telugu | Rating {3/5} | వెంకీ మామ మువీ రివ్యూ | Venkatesh, Naga Chaitanya - Sakshi
Sakshi News home page

వెంకీ మామ : మూవీ రివ్యూ

Published Fri, Dec 13 2019 1:04 PM | Last Updated on Fri, Dec 13 2019 6:14 PM

Venky Mama Movie Review and Rating in Telugu - Sakshi

టైటిల్‌: వెంకీ మామ
జానర్‌: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌
నటీనటులు : వెంకటేశ్‌, నాగచైతన్య, రాశి ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌, నాజర్‌, రావు రమేశ్‌, ప్రకాశ్‌రాజ్‌, హైపర్‌ ఆది, చమ్మక్‌ చంద్ర, గీత, కిషోర్‌
సంగీతం : థమన్‌
సినిమాటోగ్రఫి: ప్రసాద్‌ మురేళ్ల
దర్శకత్వం: బాబీ (కేఎస్‌ రవీంద్ర)
నిర్మాతలు: సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌

కొన్ని కాంబినేషన్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నటులు తెరమీద ఆడిపాడి.. అలరిస్తే చూడాలని కోరుకుంటారు. అలాంటి అరుదైన కాంబినేషన్‌ విక్టరీ వెంకటేశ్‌, యువసామ్రాట్‌ నాగచైతన్య. ఈ ఇద్దరూ రియల్‌లైఫ్‌లో మామ-అల్లులు. రీల్‌లైఫ్‌లోనూ అవే పాత్రలు వేస్తూ.. తెరమీదకు వస్తున్నారంటే సహజంగానే ఈ మల్టీస్టారర్‌ సినిమాపై మంచి క్రేజ్‌ ఉంటుంది. ‘గురు’, ఎఫ్‌-2 సినిమాలతో మంచి జోష్‌లో వెంకీ, ‘మజిలీ’ సూపర్‌హిట్‌ అందుకున్న చైతూ.. కలిసి నటించిన సినిమా ‘వెంకీ మామ’.. మరీ ఈ మామ అల్లుళ్లు తెరమీద చేసిన హంగామా ఏంటి? తమ అనుబంధంతో ప్రేక్షకులను ఏమేరకు కట్టిపడేశారు? తెలుసుకుందాం పదండి.

కథ:
రామనారాయణ (నాజర్‌) ప్రముఖ జ్యోతిష్యుడు. కానీ ఆయన కూతురు జాతకాలు పట్టించుకోకుండా ప్రేమవివాహం చేసుకుంటుంది. ఫలితంగా అన్నట్టు దంపతులిద్దరు రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోతారు. జాతకం దృష్ట్యా వారి ఏడాది కొడుకును చేరదీయడానికి రామనారాయణ నిరాకరిస్తాడు. జాతకాల కన్నా ప్రేమ గొప్పదని భావించే మేనమామ వెంకటరత్నం(వెంకటేశ్‌) ఆ చిన్నారిని ప్రేమగా చేరదీసి.. తాను పెళ్లికూడా చేసుకోకుండా పెంచి పెద్ద చేస్తాడు. మరోవైపు మామ కోసం లండన్‌లో మంచి ఉద్యోగాన్ని, ఆఖరికీ ప్రేమను కూడా తిరస్కరించడానికి కార్తీక్‌ (నాగచైతన్య) సిద్ధపడతాడు. ఈ క్రమంలో మామకు పెళ్లి చేయడానికి కార్తీక్‌.. కార్తీక్‌ ప్రేమించిన అమ్మాయిని మళ్లీ కలుపడానికి వెంకటరత్నం ప్రయత్నిస్తారు. కానీ, కార్తీక్‌ జాతక ప్రభావం వెంకటరత్నాన్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో మామకు దూరంగా వెళ్లిపోయిన కార్తీక్‌ ఆర్మీలో మేజర్‌గా చేరుతాడు. తనకు దూరంగా ఉన్న కార్తీక్‌ను వెతుక్కుంటూ వెళ్లిన వెంకటరత్నం.. అక్కడ ఎలాంటి విషయాలు తెలుసుకున్నాడు. అసలు కార్తీక్‌కు ఎదురైన కష్టమేంటి? అతన్ని కాపాడేందుకు మామ చేసిన సాహసమేంటి? ఇది మిగతా కథ.

నటీనటులు: సీనియర్‌ నటుడు వెంకటేశ్‌ తెరమీద కనిపిస్తేనే నవ్వులు విరబూస్తాయి. తన మ్యానరిజమ్స్‌, డైలాగ్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయంలో దిట్ట ఆయన. మిలటరీ నాయుడు అలియాస్‌ వెంకటరత్నం పాత్రలో మరోసారి వెంకీ అదరగొట్టాడు. ఫస్టాఫ్‌ అంతా వెంకీ తన సహాజమైన కామెడీతో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌లో గంభీరమైన పాత్రను అంతే అలవోకగా పోషించాడు. అల్లుడు కార్తీక్‌ పాత్రలో నాగచైతన్య తనదైనశైలిలో చక్కని అభినయం కనబర్చాడు. ‘మజిలీ’లో గంభీరమైన పాత్ర పోషించిన చైతూ.. ఈ సినిమాలో చలాకీ యువకుడిగా, మామకు తగ్గ అల్లుడిగా, ఆర్మీ మేజర్‌గా మెచ్యూర్డ్‌ ఫర్ఫార్మెన్స్‌ కనబర్చాడు. వెన్నెల, హారిక పాత్రల్లో పాయల్‌ రాజపుత్‌, రాశి కన్నా తమ పరిధి మేరకు నటించారు. సహజంగానే కామెడీ, పాటలు మినహా హీరోయిన్‌ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. నాజర్‌, గీత, ప్రకాశ్‌ రాజ్‌, రావూ రమేశ్‌, కిషోర్‌, హైపర్‌ ఆది తమ పాత్రలతో మెప్పించారు. 


విశ్లేషణ: 
మామ-అల్లుళ్ల స్వచ్ఛమైన అనుబంధం.. జాతకాలరీత్యా వారి జీవితంలో ఎదురైన అనూహ్య కష్టాలు ఇది సినిమా కథ. కథ సింపుల్‌గా, రోటిన్‌గా అనిపించినా దర్శకుడు బాబీ స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా తెరపై చూపించాడు. ఫస్టాప్‌ అంతా కామెడీతో ఎంటర్‌టైనర్‌గా మలిచాడు. ముఖ్యంగా వెంకీ మ్యానరిజమ్స్‌, డైలాగ్‌ డెలివరీతో తెరపై కామెడీ పండించాడు. వెంకీని రాశీ పొరపాటుగా భావించడం, అటు చైతూను కూడా పాయల్‌ అలాగే అనుకోవడం, హైపర్‌ ఆది, చమ్మక్‌ చంద్రలతో కలిసి వెంకీ, చైతూ పండించిన కామెడీ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. ఎమ్మెల్యే రావూ రమేశ్‌ను వెంకీ-చైతూ దీటుగా ఎదుర్కోవడం, చైతూ లవ్‌, బ్రేకప్‌ వంటి సీన్లతోపాటు కామెడీతో, పాటలతో ఫస్టాప్‌ వినోదాత్మకంగా సాగుతుంది. కానీ, సెకండాఫ్‌కు వచ్చేసరికి సినిమా గంభీరంగా మారిపోతోంది. జాతకాల ప్రభావం రీత్యా మామ-అల్లుళ్లు దూరం కావడం. చైతూ ఆర్మీలో చేరడం.. ఆ తదుపరి పరిణామాలు ఇవన్నీ సినిమాను గంభీరంగా నడిపిస్తాయి. ఈ సీన్లు బోర్‌ కొట్టకపోయినా.. సెకండాఫ్‌లో కొంత లాజిక్‌ తప్పిన విషయాన్ని ప్రేక్షకుడు గుర్తిస్తాడు. సెకండాఫ్‌ కొంత రోటీన్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకుడి ఊహకు అందే సినిమాటిక్‌ క్లైమాక్స్‌ ఇవన్ని రోటిన్‌ ఫీలింగ్‌ కలిగించవచ్చు. ఈ కాలంలోనూ జాతకాలూ, వాటి ప్రభావాలను ఇంతగా నమ్మేవాళ్లు ఉంటారా? అంటే సినిమాలో వాటిని నమ్మించేరీతిలో కథను బలంగా చూపించడం కనిపిస్తుంది.

ఇక, జాతకాలు, నమ్మకాల కన్నా మనిషి ప్రేమే గొప్పదన్న సందేశం చివర్లో దర్శకుడు ఇస్తాడు. ఏపీ నుంచి కథను అమాంతం కశ్మీర్‌కు తీసుకెళ్లి..  సర్జికల్‌ స్ట్రైక్స్‌ లాంటి సీన్లతో కొంత లాజిక్‌ తప్పినట్టు అనిపించినా.. దర్శకుడు బాబీ తాను అనుకున్న కథను చక్కగా తెరపై చూపించాడు. ప్రసాద్‌ మురేళ్ల సినిమాటోగ్రఫి బావుంది. కశ్మీర్‌ అందాలు, అక్కడ తెరకెక్కించిన సీన్లు బావున్నాయి. మిలటరీ నాయుడు పాటతో అదరగొట్టిన థమన్‌... నేపథ్య సంగీతంతో సినిమాకు ప్లస్‌ అయ్యాడు. డైలాగులు అక్కడక్కడా పేలాయి. సినిమాస్థాయికి తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. మొత్తానికి తొలిసారి తెర పంచుకున్న వెంకీ-చైతూ.. ప్రేక్షకులతో సెక్సీ మామ-అల్లుళ్లు అనిపించుకుంటారు. 

బలాలు
వెంకటేశ్‌, నాగచైతన్య నటన
ఫస్టాప్‌, కామెడీ
సినిమా నిర్మాణ విలువలు

బలహీనతలు
సెకండాఫ్‌ ఒకింత రోటిన్‌గా అనిపించడం
సినిమాటిక్‌ క్లైమాక్స్‌ 

- శ్రీకాంత్‌ కాంటేకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement