గ్యారేజ్కు వెంకీ కాంప్లిమెంట్స్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్తో చరిత్ర సృష్టించిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, మోహన్ లాల్ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో సీనియర్ స్టార్ హీరో జనతా గ్యారేజ్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇటీవల బాబు బంగారం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న సీనియర్ హీరో వెంకటేష్, ప్రస్తుతం సాలా ఖద్దూస్ రీమేక్గా రూపొందుతున్న గురు( వర్కింగ్ టైటిల్) సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం కండలు పెంచే పనిలో ఉన్నాడు వెంకీ. ఇటీవల జనతా గ్యారేజ్ సినిమా చూసిన ఈ సీనియర్ హీరో, యూనిట్ సభ్యులను అభినందించారు. 'జనతా గ్యారేజ్ సినిమా చూశాను. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఎన్టీఆర్, మోహన్ లాల్ నటన అద్భుతంగా ఉంది. యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు' అంటూ కామెంట్ చేశారు.