
హైదరాబాద్ వీధుల్లో భిక్షగత్తెగా విద్యాబాలన్
విద్యాబాలన్.. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయే అద్భుతమైన నటీమణి. తన నిజజీవితంలో అచ్చమైన భారతనారిలా ఉండిపోయే విద్య.. సినిమాల విషయంలోకి వచ్చేసరికి మాత్రం పాత్ర ఎలా ఉంటే అలా మారిపోతుంది. ఘన్చక్కర్ సినిమాలో ఆమె బ్రహ్మాండమైన సల్వార్-కుర్తీలలో మెరిసిపోయింది. దాంతోపాటు పాశ్చాత్య దుస్తులు కూడా వేసుకుని ఫ్యాషన్కు కొత్త అర్థం చెప్పింది. కానీ అలాంటి విద్య... హైదరాబాద్ రోడ్ల మీద భిక్షం ఎత్తుకుంటోందంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నూటికి నూరుపాళ్లు నిజం.
బాలీవుడ్ నటి విద్యాబాలన్ హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద భిక్షాటన చేస్తోంది. సినిమా ఆఫర్లు ఏమీ చేతిలో లేక.. ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయి, సొంతూళ్లో అయితే గుర్తుపడతారేమోనని ఇక్కడికొచ్చిందని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. తాజాగా తాను నటిస్తున్న 'బాబీ జాసూస్' అనే సినిమా కోసం ఆమె ఈ కొత్త అవతారంలోకి దిగింది. హైదరాబాద్లోని ఓ రైల్వే స్టేషన్ బయట భిక్షగత్తె వేషం వేసుకుని నిజంగానే డబ్బులు అడుక్కునే అమ్మాయిలా కనిపించింది. బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు నిర్మాతలు దియా మీర్జా, సాహిల్ సంఘా. ఈ సినిమా గురించి దియామీర్జా తన ట్విట్టర్ ద్వారా విద్యాబాలన్ కొత్త అవతారాన్ని బయటపెట్టింది. ఈ సినిమా 2014 మధ్యలో ఎప్పుడో విడుదల అవుతుందని భావిస్తున్నారు.