మాస్క్‌తో మెరీనాకు దళపతి
జల్లికట్టు పోరాటం తమిళనాట ఉదృ్ధత స్థాయికి చేరిన విషయం తెలిసిందే. యువత ప్రారంభించిన ఈ పోరాటం ఈ స్థాయికి చేరుతుందని మొదట ఎవరూ ఊహించలేదు. అలాంటిది జల్లికట్టు పోరాటం ఒక్కసారిగా ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఈ పోరాటాన్ని ఏ రాజకీయ పార్టీలు, పోలీసు బలగాలు కట్టడి చేయలేని పరిస్థితి. తమిళులు స్వచ్ఛందంగా చేస్తున్న పోరాటం ఇది. ఈ పోరాటం ఇష్టంలేని కొందరు కూడా మద్దతు పలకాల్సిన పరిస్థితి. అయితే కాస్త ఆలస్యంగానైనా కోలీవుడ్ జల్లికట్టుకు తాము సైతం అంటూ గొంతు కలిపింది. జల్లికట్టుకు మద్దతుగా నిరసనల కార్యక్రమాలు నిర్వహించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం శ్రుకవారం మౌనపోరాటం చేసింది. ఇది విజయవంతం అయ్యిందనే చెప్పాలి.
ఇందులో సినీ కళాకారులు భారీగా పాల్గొన్నారు. అయితే సంఘ బహిష్కరణకు గురైన మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి, మాజీ కోశాధికారి వాగై చంద్రశేఖర్ లాంటి వారు ఈ మౌన పోరాటానికి దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే జల్లికట్టుకు వ్యక్తిగతంగానూ మద్దతు పలికిన సూపర్‌స్టార్ రజనీకాంత్, కమలహాసన్, అజిత్, సూర్య, విశాల్, కార్తీ లాంటి వారు మౌన పోరాటంలో పాల్గొన్నారు. అలాంటిది ఇళయదళపతి విజయ్ నటీనటుల సంఘం మౌన పోరాటానికి డమ్మా కోట్టారు.
అయితే శుక్రవారం రాత్రి మెరీనా ప్రాంతానికి వెళ్లి అక్కడ జల్లికట్టు కోసం పోరాటం చేస్తున్న యువతను కలిసి సంఘీభావాం తెలిపారు. అదీ ముఖానికి ముసుగుతో వెళ్లారు. నటీనటుల మౌన పోరాటంలో పాల్గొనని విజయ్ ముసుగుతో మెరీనాకు వెళ్లి జల్లికట్టుకు మద్దతుగా నిలవడంలో మర్మమేమిటన్నది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.