నటుడు విజయ్
తమిళసినిమా: ఇళయదళపతి విజయ్ చిత్రాల్లో సమకాలీన రాజకీయ సంఘటనలపై సన్నివేశాలు చోటుచేసుకుంటుండడంతో వివాదాలు చుట్టుముడుతున్నాయి. విజయ్. చాలా కాలం క్రితమే తన అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చి ప్రజల్లోకి దూసుకొచ్చారు. విజయ్ రాజకీయ రంగప్రవేశం గురించి ఆయన తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖరన్ చాలా కాలం క్రితమే బహిరంగంగా వెల్లడించారు కూడా. విజయ్ తన రాజకీయ రంగానికి బాట వేసుకునే విధంగా తలైవా అనే చిత్రంలో కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం విడుదల సమయంలో పలు ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో విజయ్ తన రాజకీయ ఆలోచనను పక్కన పెట్టక తప్పలేదు.
మెర్శల్ కలకలం సమసిందనుకుంటే..
ఇటీవల విజయ్ నటించిన మెర్శల్ చిత్రానికి రాజకీయ రంగు అంటుకుంది. ఆ చిత్రంలో ఉచిత వైద్య, జీఎస్టీ పన్ను విధానానికి వ్యతిరేకంగా చోటు చేసుకున్న సన్నివేశాలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రచ్చ చల్లారిందనుకుంటున్న తరుణంలో విజయ్ మరో వివాదానికి తలుపులు తెరవడానికి సిద్ధం అవుతున్నారా? అనే చర్చకు కోలీవుడ్ కలకలం లేపుతోంది.
రాజకీయ నేపథ్యంలో తాజా చిత్రం..?
విజయ్ తాజాగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తన 62వ చిత్రం చేస్తున్నారు. ఇది రాజకీయ నేపథ్యంతో కూడిన చిత్రం అనే ప్రచారం జోరందుకుంది. ఈ చిత్రంలో విజయ్ రైతులు, మత్స్యకారుల కోసం రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పోరాడే ధనవంతుడిగా నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. రైతులకు ద్రోహం చేసే నాయకుడి పాత్రలో నటుడు రాధారవి, పళ కరుప్పయ్య నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇటీవల ఒక సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరించారు. మాతృ పార్టీ నుంచి విడిపోయి బయటకు వచ్చిన పళ కరుప్పయ్య తిరిగి సొంత పార్టీలో చేరడానికి ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంగా ఆ సన్నివేశం చోటు చేసుకుంది. రాధారవితో పళ.కరుప్పయ్య మళ్లీ కలిసే కలిసే కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహంచే సన్నివేశం అది. ఇదే సన్నివేశంలో వేదికపై బాంబు పేలేలా చిత్రీకరించారు. ఇక ఆ పార్టీ పేరును ఏఐఎంఎంకే అని పెట్టారు.
సమకాలీన రాజకీయాలే టార్గెట్
పై సన్నివేశం తమిళనాడులోని సమకాలీన రాజకీయాలకు అద్ధం పట్టే విధంగా ఉందని చెప్పవచ్చు. జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఓ.పన్నీర్‌సెల్వం వర్గం, ఎడపాడి పళనిస్వామి వర్గం అంటూ విడిపోయి, ఆ తరువాత ఒకటిగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సన్నివేశంలో మిత్ర రాజకీయాలను విజయ్ తీవ్రంగా విమర్శించినట్లు సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చిత్ర వర్గాల సమాచారం. దీంతో విజయ్ తాజా చిత్రం ఎలాం టి రాజకీయ వ్యతిరేకతకు గురౌతుందోనన్న ఆసక్తి చిత్ర పరిశ్రమలో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment