
దాదాపు 13 ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించారు లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి. రాజకీయాల్లో బీజిగా ఉన్న విజయశాంతి.. ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ భారతి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం తర్వాత విజయశాంతి మరిన్ని చిత్రాల్లో నటిస్తారా? లేక రాజకీయాలపైనే ఫోకస్ చేస్తారా? అనే చర్చ మొదలైంది. దీంతో తన భవిష్యతు కార్యచరణపై విజయశాంతి స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆమె ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, అనిల్ రావిపూడిలతోపాటు తనను ఆదరిస్తున్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ సినిమాల్లో నటించే సమయం వస్తుందో, లేదో తెలియదని.. ఇప్పటికి ఇక సెలవని విజయశాంతి పేర్కొన్నారు. ప్రజా జీవన పోరాటంలోనే తన ప్రయాణమని వెల్లడించారు.
‘సరిలేరు మీకెవ్వరు.. ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా నట ప్రస్థానానికి కుళ్లుకుల్ ఇరమ్, కిలాడి కృష్ణుడు నుంచి నేటి సరిలేరు నీకెవ్వరు వరకు ఆ గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం.. మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి సెలవు’ అని విజయశాంతి ట్వీట్ చేశారు. కాగా, సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని పాత్ర నచ్చడంతోనే తాను నటించేందుకు అంగీకరించానని విజయశాంతి పలు సందర్భాల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment