
ఆ అవకాశం నాకూ రావాలి
– విజయేంద్రప్రసాద్
‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ అలనాడు దాశరథి నిజామాబాద్ కారాగారం సాక్షిగా నినదించారు. తెలంగాణది గొప్ప పోరాటాల చరిత్ర. తెలంగాణ తల్లి రుణం తీర్చుకునే అవకాశం నాకూ రావాలని కోరుకుంటున్నా’’ అని రచయిత–దర్శకుడు విజయేంద్రప్రసాద్ అన్నారు. ‘బందూక్’ ఫేమ్ లక్ష్మణ్ దర్శకత్వంలో లక్ష్మణ్ కొణతం నిర్మించనున్న ‘గులాల్’ మోషన్ పోస్టర్‌ని విజయేంద్రప్రసాద్ రిలీజ్ చేశారు.
‘బందూక్’ లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి జీవిత క్రమాన్ని ఈ సినిమాలో ఐదు భాగాలుగా చూపించనున్నాం. కారణజన్ముడి జననం, బాల్యం మొదలుకొని ఉద్యమ ప్రస్థానం, బంగారు తెలంగాణ సాధన దిశగా సాగుతున్న పాలన ప్రధానాంశాలుగా ఈ చిత్రం ఉంటుంది. త్వరలో కేసీఆర్‌గారికి ఈ చిత్ర ఇతివృత్తాన్ని వివరించి, ఆయన అనుమతి తీసుకోవాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం అనేక మంది కవులు, మేధావులను కలుసుకున్నాం’’ అన్నారు లక్ష్మణ్ కొణతం. దర్శకుడు ఇ.నివాస్, నిర్మాతలు మల్కాపురం శివకుమార్, వల్లూరిపల్లి రమేష్, యుగంధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.