టైటిల్ : వినయ విధేయ రామ
జానర్ : యాక్షన్ డ్రామా
తారాగణం : రామ్ చరణ్, కియారా అద్వానీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : బోయపాటి శ్రీను
నిర్మాత : డీవీవీ దానయ్య
రంగస్థలం లాంటి ఘనవిజయం తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ వినయ విధేయ రామ. కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. వరుస ప్రయోగాల తరువాత చరణ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో వస్తుండటంతో అభిమానులు కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఇంతటి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన వినయ విధేయ రామ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? రామ్‌చరణ్ తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడా..? బోయపాటి మాస్ ఫార్ములా వర్క్ అవుట్ అయ్యిందా..?
కథ :
రామ (రామ్‌చరణ్)కు తన అన్నలంటే ప్రాణం. పెద్దవాడు భువన్ కుమార్(ప్రశాంత్) అంటే అందరికీ గౌరవం. తన వారి కోసం చదువును భవిష్యత్తును కాదనుకొని అన్నలను పెద్ద చదువులు చదివిస్తాడు రామ. భువన్ కుమార్ ఎలక్షన్ కమిషనర్‌గా వైజాగ్‌లో పనిచేస్తుండగా పందెం పరుశురాం (ముఖేష్ రుషి) అనే వ్యక్తితో గొడవ అవుతుంది. అన్నల జోలికి ఎవరు వచ్చిన సహించలేని రామ, పరుశురాంని అతడి అనుచరులను కొట్టి ఎలక్షన్లు సజావుగా జరిగేలా చూస్తాడు.
అదే సమయంలో బీహార్‌లోని ఓ ప్రాంతాన్ని తను కనుసైగలతో శాసిస్తున్న వ్యక్తి రాజు భాయ్ మున్నా (వివేక్ ఒబెరాయ్). రాజు భాయ్ తన ప్రాంతంలో ఎలక్షన్‌లే లేకుండా తనకు నచ్చిన వారినే పదువుల్లో పెట్టుకుంటున్నాడని తెలిసి, భువన్ కుమార్‌ను అక్కడికి ఎలక్షన్ కమీషనర్‌గా పంపిస్తారు. తనకు ఎవరు ఎదురొచ్చినా అంతం చేసే రాజు భాయ్, భువన్ కుమార్‌ను ఏం చేశాడు.? అన్న కోసం రామ ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
ధృవ, రంగస్థలం లాంటి ప్రయోగాల తరువాత పక్కా మాస్ కమర్షియల్ సినిమాలో నటించిన రామ్ చరణ్, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. చాలా సన్నివేశాల్లో చిరంజీవిని అనుకరించినట్టుగా అనిపించినా.. రామ పాత్రలో ఒదిగిపోయాడు. నటుడిగానూ మంచి పరిణతి కనిపించింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో చరణ్ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ కియారా అద్వానీ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. పాటలు అవసరమైనప్పుడు వచ్చిపోవటం తప్ప పెద్దగా నటనకు ఆస్కారం లేదు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ప్రశాంత్, సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. వదిన పాత్రలో స్నేహ హుందాగా కనిపించింది. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన బాగుంది. విలన్‌గా వివేక్ ఒబెరాయ్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆర్యన్ రాజేష్, ముఖేష్ రుషి, హరీష్ ఉత్తమన్, రవి వర్మ, మధునందన్ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఎవరికీ రెండు మూడు డైలాగ్‌లకు మించి లేవు.
విశ్లేషణ :
రంగస్థలం లాంటి సూపర్ హిట్ తరువాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావటంతో వినయ విధేయ రామపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటం లో చిత్రయూనిట్ పూర్తిగా విఫలమైంది. బోయపాటి సినిమా అంటే భారీ యాక్షన్ ఎపిసోడ్స్, హై ఎమోషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అయితే సినిమాలో యాక్షన్ కాస్త శ్రుతి మించినట్టుగా అనిపిస్తుంది. బోయపాటి గత చిత్రాలతో పోలిస్తే ఎమోషనల్ సీన్స్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. తెర నిండా నటీనటులు ఉన్నా ఎవరినీ సరిగ్గా వినియోగించుకోలేదు. రామ్ చరణ్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో సినిమా చేసే ప్రయత్నంలో కథా కథనాలు పూర్తిగా గాడి తప్పాయి. హీరోను అంచనాలకు మించి చూపించే ప్రయత్నంలో ఏ మాత్రం నమ్మశక్యంగా లేని పోరాట సన్నివేశాలను డిజైన్ చేశారు. ఒక దశలో యాక్షన్ సీన్స్ మధ్యలో కథ వచ్చిపోతున్న భావన కలుగుతుంది. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. రిషీ పంజాబీ తన సినిమాటోగ్రఫితో సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. ఎలివేషన్ షాట్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌లో సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
రామ్ చరణ్
కొన్ని యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
మితిమీరిన హింస
ఫోర్స్‌డ్ సీన్స్
సంగీతం
దర్శకత్వం
సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment