తమిళ సినిమా : చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై రెండు రోజుల్లో సమగ్ర చర్చా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర సమాచార, ప్రచార శాఖామంత్రి కడంబూర్ రాజు వెల్లడించారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, నిర్మాతలమండలి, థియేటర్ల యాజమాన్యానికి మధ్య నెలకొన్న సమస్యలపై పలు దపాలు జరిగిన చర్యలు విఫలం కావడంతో నిర్మాతల మండలి మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త చిత్రాల విడుదలను నిలిపివేయడంతో పాటు, మార్చి 16వ తేదీ నుంచి చిత్ర షూటింగ్‌లతో పాటు, అన్ని సినిమా కార్యక్రమాలను నిలిపివేసి సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
దీంతో లక్షలాది సినీ కార్మికులు పని లేక ఆర్థిక ఇబ్బందులను చవిచూస్తున్న పరిస్థితి. నిర్మాతల మండలి, థియేటర్ల సంఘం. క్యూబ్ సంస్థల అధినేతలు ఎవరికి వారు పట్టు విడవకుండా పంతాలకు పోవడం ఈ క్లిష్ట పరిస్థితికి కారణం. ప్రస్తుతం నెల కొన్న సమస్యను ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ బుధవారం సాయంత్రం రాష్ట్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి కడంబూర్ రాజు కలిసి విజ్ఞప్తి చేశారు. మంత్రి కడంబూర్ రాజు సినీ సంఘాల నిర్వాహకులతో రెండు రోజుల్లో సమగ్ర చర్చా సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
లక్షలాది మంది సినీ కార్మికులు భృతిని కోల్పోవడాన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చేస్తామని మంత్రి పేర్కొన్నారు. విశాల్ మీడియాతో మాట్లాడుతూ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల చార్జీలు తగ్గించడం, థియేటర్ల టికెట్ ధర, ఆన్‌లైన్ బుకింగ్, పార్కింగ్ చార్జీలు, తినుబండారాల ధరల నియంత్రణ వంటి విషయాలపై మంత్రి కడంబూర్ రాజుకు వివరించానన్నారు. అన్ని సమస్యలౖను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
భారతీరాజా హెచ్చరిక :
దర్శకుడు భారతీరాజ్ ఐపీఎల్ క్రికెట్ పోటీలపై ధ్వజమెత్తారు. రాష్ట్రం ఒక పక్క కావేరి బోర్డు వంటి సమస్యలతో పోరుబాట పడుతుంటే ఐపీఎల్ క్రికెట్ పోటీలను నిర్వహించడం సబబు కాదన్నారు. ఈ పోటీలను నిర్వహించొద్దని తాము చెప్పడం లేదని, రాష్ట్రంలో సమస్యలకు పరిష్కారం లభించిన తరువాత జరుపుకోవాలని అన్నారు. లేని పక్షంలో జల్లికట్టు పోరు తీరులో తమిళుల ఆగ్రహాన్ని చవిచూస్తారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment