'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ రివ్యూ | Vunnadhi Okate Zindagi Movie Review | Sakshi
Sakshi News home page

'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ రివ్యూ

Published Fri, Oct 27 2017 12:24 PM | Last Updated on Fri, Oct 27 2017 1:06 PM

Vunnadhi Okate Zindagi Movie Review

టైటిల్             : ఉన్నది ఒకటే జిందగీ
జానర్            : ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్
తారాగణం      : రామ్ పోతినేని, అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, శ్రీవిష్ణు
సంగీతం         : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం     : కిశోర్ తిరుమల
నిర్మాత          : స్రవంతి రవికిశోర్


నేను శైలజ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో రామ్, తరువాత హైపర్ తో మరోసారి తడబడ్డాడు. అందుకే తన కెరీర్ ను గాడిలో పెట్టే బాధ్యతను మరోసారి దర్శకుడు కిశోర్ తిరుమల చేతిలో పెట్టాడు. తొలి సినిమాలో కేవలం ప్రేమ కథ మీదే ఫోకస్ పెట్టిన రామ్, కిశోర్ లు ఉన్నది ఒకటే జిందగీలో లవ్ తో పాటు స్నేహబంధాన్ని కూడా అదే స్థాయిలో చూపించారు. మరి రామ్ నమ్మకాన్ని కిశోర్ నిలబెట్టుకున్నాడా..? ఈ ఇద్దరి కాంబినేషన్ నేను శైలజ మ్యాజిక్ ను రిపీట్ చేసిందా..?

కథ :
అభి (రామ్ పోతినేని) స్నేహమంటే ప్రాణమిచ్చే కుర్రాడు. స్కూల్ లో తన తో పాటు చదువుకునే వాసు (శ్రీ విష్ణు) అంటే అభికి ప్రాణం. వాసు జోలికి ఎవరు వచ్చిన అభి ఊరుకోడు. అంతేకాదు ఆరేళ్ల వయసులోనే మంచి స్కూల్ లో సీటు వచ్చినా.. వాసు కోసం వదులుకుంటాడు అభి. వారి వయసుతో పాటు వారి స్నేహం కూడా పెరిగి పెద్దదవుతుంది. అభికి వాసుతో పాటు మ్యూజిక్ అంటే కూడా ఇష్టం, సొంతంగా ఓ రాక్ బ్యాండ్ ను తయారు చేసుకోని కన్సర్ట్ లు ఇస్తుంటాడు. (సాక్షి రివ్యూస్‌) హ్యాపిగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి ఓ ప్రమాదం కారణంగా మహా (అనుపమా పరమేశ్వరన్) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. మహాకు కూడా సంగీతం అంటే ఇష్టముండటంతో పాటు అభి తన కుటుంబ సమస్యల విషయంలో ధైర్యం చెప్పటంతో మహా, అభిలు ఒకరినొకరు ఇష్టపడతారు.

కానీ అదే సమయంలో వాసు కూడా మహాను ఇష్టపడుతున్న విషయం అభికి తెలుస్తుంది. మన మధ్య ఈగోలు రాకూడదన్న ఒప్పందంతో అభి, వాసులు ఒకేసారి మహాకు ప్రపోజ్ చేస్తారు. కానీ మహా మాత్రం వాసుకే ఓకె చెపుతుంది. వాసు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా మహాకే వ్యాల్యూ ఇస్తుండటంతో కోపంతో అభి, వాసుకు దూరంగా వెళ్లిపోతాడు. ప్రాణమైన ఫ్రెండ్ ను కాదని అభి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు..? అభి, వాసు తిరిగి కలుసుకున్నారా..? వీరి కథలో వెడ్డింగ్ ప్లానర్ మేఘన (లావణ్య త్రిపాఠి)కి సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
నేను శైలజ సినిమాలో సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న రామ్, ఈసినిమాలో తన మార్క్ ఎనర్జీని కూడా చూపించాడు. ముఖ్యంగా రాక్ స్టార్ లుక్ లో రామ్ బాడీ లాంగ్వేజ్, పర్పామెన్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ లో రామ్ నటన కంటతడి పెట్టిస్తుంది. వాసు పాత్రలో శ్రీ విష్ణు ఒదిగిపోయాడు. ఫ్రెండ్ అంటే ప్రాణమిచ్చే స్నేహితుడిగా, ప్రియురాలు దూరమైన ప్రేమికుడిగా మంచి నటన కనబరిచాడు.(సాక్షి రివ్యూస్‌) అనుపమా పరమేశ్వరన్ అందంగా హుందాగా కనిపించింది. కళ్లతోనే భావాలను పలికిస్తూ మహా పాత్రకు ప్రాణం పోసింది. సెకండ్ హాఫ్ లో మేఘనగా లావణ్య త్రిపాఠి నటన బబ్లీ బబ్లీగా అలరించింది. గ్లామర్ షోతోనూ లావణ్య మంచి మార్కులు సాధించింది. ఫ్రెండ్స్ గా నటించిన ప్రియదర్శి ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.


సాంకేతిక నిపుణులు :
నేను శైలజ సినిమాతో రామ్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కిశోర్ తిరుమల మరోసారి అదే బాధ్యతను తీసుకొని ఉన్నది ఒకటే జిందగీ సినిమాను తెరకెక్కించాడు. ప్రేమ, స్నేహంల మధ్య కిశోర్ రాసుకున్న కథ మరోసారి యూత్ ఆడియన్స్ ను కట్టిపడేసేలా ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ లో కిశోర్ టాలెంట్ సూపర్బ్ అనిపిస్తుంది. కానీ తొలి భాగం మరింత వేగంగా కథ నడించి ఉంటే బాగుండనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు కథలో పెద్దగా ట్విస్ట్ లు లేకుండా ఫ్రెండ్స్ మధ్య సరదా సన్నివేశాలతోనే కథ నడిపించటం కాస్త ఇబ్బంది పెడుతుంది. అయితే క్లైమాక్స్  ట్విస్ట్ తో అన్ని మరిచిపోయేలా అందమైన ముగింపునిచ్చి అలరించాడు దర్శకుడు.(సాక్షి రివ్యూస్‌) సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం. ఇప్పటికే సూపర్ హిట్ అయిన వాట్ అమ్మా, ట్రెండ్ మారినా పాటలు వెండితెర మీద మరింతగా అలరించాయి. ఎమోషనల్ సీన్స్ కు దేవీ తన బెస్ట్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో మరికాస్త దృష్టి పెట్టాల్సింది.


ప్లస్ పాయింట్స్ :
రామ్ నటన
ఎమోషనల్ సీన్స్
సంగీతం

మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్


- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement