ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా: పవన్
రోహిత్ వేముల ఆత్మహత్యపై పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో స్పందించారు. యూనివర్సిటీలు విజ్ఞాన భాండాగారాలు కావాలి తప్ప, రాజకీయ పార్టీలకు యుద్ధక్షేత్రాలు కాకూడదని, ఆ రోజు కోసం తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. రోహిత్ ఆక్రోశంపై ముందుగానే స్పందించి కౌన్సెలింగ్ ఇప్పించి ఉంటే అతడు ఆత్మహత్య చేసుకునేవాడు కాడని చెప్పారు. తన వరుస ట్వీట్లలో పవన్ ఏమన్నారో చూద్దాం..
చాలా లక్షల మంది ప్రజల్లాగే రోహిత్ వేముల కూడా బీజేపీని ద్వేషించాడనడంలో అనుమానం లేదని చెప్పారు. కానీ అంతమాత్రాన తమకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉండే వ్యక్తులను వేధించడానికి వారికి లైసెన్సు ఏమీ లేదన్నారు. పైగా అతడు ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నప్పుడు అలా చేయడం సరికాదన్నారు. ఇది కేవలం బీజేపీకి మాత్రమే కాదని.. అన్ని పార్టీలు, గ్రూపులకు కూడా వర్తిస్తుందని చెప్పారు. యూనివర్సిటీలోని తన ప్రత్యర్థి గ్రూపులతో కాషాయీకరణ గురించిరోహిత్ చెప్పినా, కేంద్రం దాన్ని కేవలం విద్యార్థుల మధ్య సిద్ధాంతపరమైన విభేదంగానే చూసి ఉండాల్సిందని అన్నారు. వాళ్ల గొడవవల వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తి ఉంటే అప్పుడు సంబంధిత అధికారులను క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పి ఉండొచ్చని పవన్ అన్నారు. కానీ, కేంద్రం ఈ విషయాన్ని వ్యక్తిగత అంశంగా తీసుకుందని, అందుకు కారణాలేంటో తెలియదని తెలిపారు. తనను సస్పెండ చేయడం, క్యాంపస్ నుంచి వెలివేయడం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని, తన సొంత వర్గం నుంచి కూడా ఆశించినంత నైతిక మద్దతు లభించకపోవడం వల్ల అలా జరిగిందని అన్నారు.
మానవీయ కోణంలో అతడికి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే ఒక తెలివైన విద్యార్థి ప్రాణాలు కాపాడినట్లు అయ్యేదని చెప్పారు. ఇందులో మరో విషాదకరమైన కోణం కూడా ఉందని.. బీజేపీయేతర పార్టీలన్నీ ఈ ఘటన నుంచి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించాయని, ఇక బీజేపీ అనుబంధ పక్షాలైతే అతడు దళితుడు కాడన్న విషయాన్ని నిరూపించడంలో బిజీ అయిపోయాయని విమర్శించారు. కానీ వాళ్లలో ఏ ఒక్కరూ కూడా భవిష్యత్తులో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో అనే విషయానికి సమాధానం వెతికే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు.