
తమిళసినిమా: కారణాలేమైనా కొంత కాలంగా విజయ్ చిత్రాలకు విడుదల సమయంలో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తలైవా చిత్రం ఎన్నో ఇబ్బందులను ఎదురొడ్డి తెరపైకి వచ్చింది. అదే విధంగా తుపాకీ, కత్తి చిత్రాలు తీవ్ర వివాదాలు, చర్చలనంతరం విడుదలయ్యాయి. తాజాగా విజయ్ నటించిన చిత్రం మెర్శల్. ఈ చిత్రానికి మొదటి నుంచి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే మెర్శల్ చిత్రం వరుసగా ఒక్కో సమస్యను వరుసగా ఎదురొడ్డి గెలుచుకుంటూ వస్తోంది. ఇటీవల మెర్శల్ టైటిల్‌ను విజయ్ చిత్రానికి ఇవ్వరాదంటూ చంద్రశేఖర్ అనే వ్యక్తి కోర్టుకెక్కారు.
ఆ సమస్య నుంచి బయట పడడానికి చిత్ర వర్గాలు కోర్టు బోనెక్కి పోరాడాల్సి వచ్చింది. టైటిల్ సమస్య తొలగిందని ఊపిరి పీల్చుకుని చిత్ర విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్న సంతోష తరుణంలో తాజాగా సెన్సార్ సమస్య తలనొప్పిగా మారింది. ఈ చిత్రంలో జల్లికట్టు దృశ్యాలు చోటు చేసుకున్నాయి. అందుకు జంతుసంక్షేమ శాఖ నుంచి ఎన్‌ఓసీ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. మెర్శల్ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్‌బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
అయితే చిత్ర వర్గాలు మరో ఐదు రోజుల్లో, నాలుగు రోజుల్లో అంటూ ప్రచారం చేస్తున్నారే కానీ, ఇప్పటి వరకూ తేదీని వెల్లడించలేదు. మెర్శల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సారుకు వెళ్లిన మాట వాస్తవమే. అయితే సెన్సార్ సర్టిఫికెట్ మాత్రం ఇప్పటి వరకూ లాలేదు. దీపావళికి విడుదల అని చిత్ర వర్గాలు ప్రచారం చేయడంతో జంత సంక్షేమ శాఖ( యానిమల్ వెల్‌ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మెర్శల్ చిత్రానికి తాము ఎన్‌ఓసీ సర్టిఫికెట్ అందించలేదట.
సెన్సార్ సభ్యుల వివరణ
ఈ విషయం గురించి సెన్సార్‌సభ్యుల వివరణ ఏమిటంటే మెర్శల్ చిత్రం ఈ నెల 6వ తేదీన సెన్సార్ స్క్రీనింగ్ వచ్చిన మాట నిజమేనని, అయితే చిత్రాన్ని చూసిన తాము ఎన్‌ఓసీ కోసం జంతు సంక్షేమ శాఖ అధికారులకు పంపామని, వారు ఎన్‌ఓసీ సర్టిఫికెట్ ఇచ్చిన తరువాత తాము సెన్సార్ సర్టిఫికెట్‌ను అందిస్తామని చిత్ర నిర్మాతలకు చెప్పామని అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ వారికి జంతు సంక్షేమ శాఖ నుంచి ఎన్‌ఓసీ రాలేదని తెలిపారు.
ఆరు నూరైనా
మొన్నటి వరకూ వినోదపు పన్ను సమస్య కారణంగా కొత్త చిత్రాల విడుదల అయోమయంగా మారింది. అది కాస్త పరిష్కారం అయ్యిందనుకుంటే, మెర్శల్ చిత్రానికి జంత సంక్షేమ శాఖ ఆటంకంగా మారింది. పరిస్థితి ఇలా ఉంటే చిత్ర నిర్మాత శ్రీతేనాండాళ్ ఫిలింస్ అధినేత మాత్రం ఆరు నూరైనా మెర్శల్ చిత్రాన్ని దీపావళికి విడుదల చేస్తామని అంటున్నారు. అందుకు ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు నిర్మాత అంటున్నారు.విశేషం ఏమిటంటే ఇది ఈ సంస్థలో రూపొందిన నూరవ చిత్రం.మరో పక్క మెర్శల్ చిత్ర అడ్వాన్స్ టిక్కెట్ల విక్రమణ సందడి శనివారం నుంచి మొదలైంది. తమిళ ప్రేక్షకులు కొత్త చిత్రాలను చూసి రెండు వారాలైంది. దీంతో మెర్శల్ చిత్రం చూడడానికి ప్రేక్షకులు ఆతృత పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment