సాక్షి, న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్న 'పద్మావత్' సినిమాకు మరో షాక్ తగిలింది. కేంద్ర సెన్సార్ బోర్డు ఈ సినిమా విడుదలకు అంగీకరించినా.. ఇందుకు తాము అంగీకరించబోమని రాజస్థాన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ సినిమాను నిషేధించాల్సిందేనని, తమ రాష్ట్రంలో ఈ సినిమా విడుదలకు అంగీకరించబోమని రాజస్థాన్ ప్రకటించింది.
మరోవైపు రాజ్‌పుత్‌లు కూడా 'పద్మావత్’ సినిమాపై కారాలు మిరియాలు నూరుతున్నారు. కేవలం సినిమా పేరును మాత్రమే మారిస్తే సరిపోదని, సినిమాలోని పాత్రధారుల పేర్లను కూడా మార్చాలని రాజ్‌పుత్ కర్ణిసేన డిమాండ్ చేసింది. ‘ఈ సినిమా విషయంలో మేం మొదటినుంచి ఒకే మాటకు కట్టుబడి ఉన్నాం. ఈ సినిమాను నిషేధించాలనే కోరుతున్నాం. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఈ సినిమా బాగా లేదని, చరిత్రని వక్రీకరించారని, కేవలం డబ్బుల కోసమే ఈ సినిమాను తీశారని నివేదించింది’’ అని కర్ణిసేన సభ్యుడు మణిపాల్ సింగ్ మకర్ణ మీడియాతో తెలిపారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని మేం ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నామని, విషయాన్ని నేను ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్తానని అన్నారు. లేదంటే సినిమా విడుదల తర్వాత జరిగే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ సినిమా విషయంలో సీబీఎఫ్‌సీ చైర్మన్ జోషి, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. సినిమా విడుదలైతే.. పెట్రోల్ పోసి థియేటర్లను తగులబెడతామని కర్ణిసేన సభ్యులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment