తీర్థం ఇచ్చే చేతికి గన్ దొరికితే? మంత్రాలు చదివే మనిషి.. కంత్రీలతో తిరిగితే?శివ్ అలాంటి వాడే. యూపీలో కొట్టేవాడు. బిహార్ వణికేది. పాతికేళ్లకే గడగడలాడించిన డాన్ వాడు. ఎలా డాన్ అయ్యాడు? చివరికెలా గన్ డౌన్ అయ్యాడు? చదవండి.. ఈవారం ‘వెబ్ ఫ్లిక్స్’లో.
‘‘ఈ ఇంట్లో నాటిన చెట్టు కాత కొచ్చే సమయానికి కొమ్మలు, రెమ్మలు, కాయలతో పక్కింట్లో వాలింది. ఆ చెట్టుపళ్లను ఆ ఇంటి వాళ్లు కోయొద్దు.. అంటే కోయకుండా ఉంటారా?’’ ఓ గ్యాంగ్‌స్టర్ మరో గ్యాంగ్‌స్టర్‌ను అడుగుతాడు. ఈ లైన్ చుట్టూ అల్లుకున్నదే రంగ్‌బాజ్. జీ5లో కొత్తగా అప్‌లోడైన క్రైమ్ థ్రిల్లర్. 1990ల నాటి ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌వార్ ఈ సీరియల్‌కి నేపథ్యం. సెటిల్‌మెంట్లు, మారణాయుధాల అక్రమ రవాణా సామ్రాజ్యాన్ని యూపీ గోరఖ్‌పూర్ టు బీహార్ పట్నా దాక విస్తరింపచేసిన ఓ పాతికేళ్ల యువకుడి కథ.
వెబ్‌ప్లే
1974, గోరఖ్‌పూర్.. బ్రాహ్మణ వర్ణానికి చెందిన రామ్‌శంకర్ తివారి (తిగ్‌మాంశు ధులియా), రాజపుత్రుడైన మేహా అనే ఇద్దరూ ఆయా సామాజిక వర్గాలకు ప్రతినిధులుగా, బలమైన శక్తులుగా, తూటాలు పేల్చుకునే ప్రత్యర్థులుగా మారుతారు. తమ బలగాలతో గోరఖ్‌పూర్‌ను ఏలుతుంటారు. రాజకీయాల్లోకీ అడుగుపెడ్తారు. తొంభయ్యవ దశకం వచ్చేసరికి ఎదురులేని ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీలోనూ గ్యాంగ్‌వార్‌ను కొనసాగిస్తుంటారు. గ్యాంగ్‌ను మెయింటేన్ చేసుకోవడానికి గోరఖ్‌పూర్ యూనివర్శిటీలోని స్టూడెంట్స్‌ను వలలో వేసుకుంటూంటారు వాళ్లకు తుపాకులిస్తూ. అలా రామ్‌శంకర్ తివారీకి చిక్కిన విద్యార్థే శివ్ ప్రకాశ్ శుక్లా (సాఖీబ్ సలీమ్).
గురి మార్చిన తూటా
శివ్ ప్రకాశ్ శుక్లా తండ్రి స్కూల్ మాస్టర్. పాఠాలు చెప్పడం తప్ప ఇంకో ప్రపంచం లేని వ్యక్తి. శివ్ ప్రకాశ్ తల్లి ఆ తండ్రికి తగ్గ ఇల్లాలు. శివ్‌కు ఓ చెల్లి. అన్నంటే ప్రాణం. ఆ అమ్మాయి ఒకరోజు కాలేజ్ నుంచి వస్తుంటే ఓ షాపు యజమాని (యువకుడే) అల్లరి పెడ్తాడు. విషయం తెలుసుకున్న శివ్ ఆవేశంతో తన స్నేహితుడి దగ్గరున్న గన్ తీసుకొని అల్లరి పెట్టిన వాడిమీదకు వెళ్తాడు, బెదిరించాలనుకొని. పెనుగులాటలో తుపాకి పేలుతుంది. షాపు యజమాని నేలకొరుగుతాడు. భయంతో వచ్చి ఇంట్లో దాక్కుంటాడు శివ్. తల్లి, తండ్రి, చెల్లి షాక్ అవుతారు అతను చేసింది విని. ఏమీ పాలుపోదు ఎవరికీ. అప్పుడు వాళ్లింటికి వస్తాడు రామ్‌శంకర్ తివారి. భయపడొద్దు అంటూ వాళ్లకు అభయమిచ్చి శివ్‌ను వెంట తీసుకెళ్లిపోతాడు. విశ్వసనీయమైన అనుచరులతో అతనిని బ్యాంకాక్ పంపిస్తాడు. గురి చూసి తుపాకీ పేల్చడం, మూడో కంటికి తెలియకుండా టాస్క్ పూర్తి చేయడం వంటివాటిలో శిక్షణ ఇప్పిస్తాడు అక్కడే. అతని మీద పూర్తి నమ్మకం వచ్చాకే తిరిగి గోరఖ్‌పూర్‌లో దింపుతాడు రామ్ శంకర్ తివారి. శివ్‌కు తన ప్రత్యర్థి మేహాను చూపించి హత్య చేయమంటాడు. తుపాకి బొడ్లో దోపుకొని బయలుదేరుతాడు శివ్.
నడి రోడ్డు మీద..
మనుషులను కిడ్నాప్ చేసి చంపడం అన్న ఓల్డ్‌స్టయిల్‌కు గుడ్‌బై చెప్తాడు శివ్ నడి రోడ్డుమీదే తుపాకి గురిపెడుతూ. ఈ విపరీతానికి గోరఖ్‌పూరే కాదు ఉత్తరప్రదేశ్ అంతా వణుకుతుంది. రామ్‌శంకర్ తివారి గర్వపడ్తుంటాడు. ఇరవై రెండేళ్ల కుర్రాడు నెత్తుటి భయం లేకుండా బహిరంగ హత్యలతో వీరంగం చేస్తుంటే ప్రత్యర్థి రక్తం చల్లబడ్తుంటుంది. మేహా కణతలో తూటా దింపుతాడు శివ్. తనకు ఏకచ్ఛత్రాధిపత్యం వచ్చేసిందన్న ఆనందాన్ని రామ్‌శంకర్ ఆస్వాదిస్తుండగానే శివ్ స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడన్న చేదూ అతని చెవినపడుతుంది. కొడుకును కాదని పరాయివాడిని విశ్వసిస్తే జరిగిన నిర్వాకానికి నివ్వెరపోతాడు. శివ్ ధైర్యాన్ని, సాహసాన్ని అటు బీహార్ నేత చంద్రభాన్ సింగ్ ఉపయోగించుకోవాలనుకుంటాడు. తనకు సహాయం చేయమని కోరుతాడు. దీన్నే బాస్ రామ్‌శంకర్‌కు చెప్పకుండా సొంతంగా చేసేస్తాడు శివ్. అప్పటి నుంచి శివ్ చర్యల మీద ఓ కన్నేసి ఉంచుతాడు రామ్‌శంర్. శివ్ నిజాయితీని పరీక్షించడానికి ఒక మంత్రిని చంపే పని అప్పగిస్తాడు. సరేనని ఇంకో మంత్రిని చంపేస్తాడు శివ్.. బీహార్ గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత చంద్రభాన్ ఆజ్ఞప్రకారం. దీంతో శివ్ తన మనిషి కాదని రూఢీ అవుతుంది రామ్‌శంకర్‌కి. అప్పటికే శివ్ స్వతంత్రంగా ఓ సేననూ తయారు చేసుకుని ఉంటాడు. మంత్రి హత్యతో చంద్రభాన్‌సింగ్‌కు సన్నిహితుడవుతాడు. రామ్‌శంకర్ తివారి కూడా భయపడేంత బలవంతుడవుతాడు శివ్. నిండా పాతికేళ్లు కూడా లేని అతనితో మాట్లాడాలంటే చంద్రభాన్ మధ్యవర్తిత్వం తీసుకోవాల్సి వచ్చేంత పెద్దవాడవుతాడు.
చెల్లి పెళ్లి
బ్యాంకాక్ నుంచి వచ్చాక శివ్ ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్తాడు. వార్తాపత్రికల్లో వస్తున్న కథనాలతో కొడుకు దందా అర్థమైపోతుంది తండ్రికి. శివ్ తల్లిదండ్రులుగా వీళ్లను చూసి జనాలు భయపడ్తుంటే సిగ్గుతో తలదించుకుంటుంటారు. పరిస్థితి మరీ దిగజారకముందే కూతురికి పెళ్లిచేసెయ్యాలని సంబంధం ఖాయం చేస్తారు. చెల్లి ఫ్రెండ్, తన గర్ల్‌ఫ్రెండ్ అయిన శృతి అనే అమ్మాయి ద్వారా చెల్లి పెళ్లి విషయం తెలుసుకుని ఇంటికి వస్తాడు శివ్. తనకు చెప్పకుండా చెల్లి పెళ్లి ఎట్లా చేస్తారు? అంటూ తల్లిదండ్రులతో గొడవపడ్తాడు. నిన్ను ఇన్‌వాల్వ్ చేస్తే గూండా చెల్లెలికి ఈ జన్మలో పెళ్లవుతుందా? అని నిలదీస్తారు తల్లిదండ్రులు. మారు మాట్లాడకుండా చెల్లి చేతిలో డబ్బు పెట్టి వెళ్లిపోతాడు శివ్. నిశ్చితార్థానికి తప్పకుండా ఇంటికి వస్తాడని, ఆ టైమ్‌లో వాడి చావుకి ముహూర్తం పెట్టమని తన కొడుక్కి పురమాయిస్తాడు రామ్‌శంకర్ తివారి. కాని శివ్‌రాడు. దాంతో శివ్ గర్ల్‌ఫ్రెండ్‌ని టార్గెట్ చేస్తాడు రామ్‌శంకర్. ఆ పిల్లకు తన మేనల్లుడితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అది అశనిపాతమవుతుంది శివ్‌కి. ‘‘నీ పద్ధతితో విసిగిపోయారు. నవ్వు మారవు. నాకీ తుపాకులు, గోరఖ్‌పూర్ వాతావరణం నచ్చట్లేదు. అందుకే బెంగుళూరులో మంచి ఉద్యోగం చేసుకుంటున్న రామ్‌శంకర్ మేనల్లుడితో పెళ్లికి ఒప్పుకున్నాను’’ అని చెప్పి దూరమవుతుంది శృతి. కుంగిపోతాడు. రామ్‌శంకర్ మీద ఇంకా పగపెంచుకుంటాడు. రామ్‌శంకర్ కన్‌స్ట్రక్షన్ బిజినెస్ పార్ట్‌నర్‌ను కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేస్తాడు. ఆ డబ్బుతో పట్నా వెళ్లిపోయి అక్కడ కాంట్రాక్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే లక్ష్యంతో. ఆ మేరకు చంద్రభాన్ కూడా భరోసా ఇస్తాడు. డబ్బులిచ్చినట్టే ఇచ్చి ఆ కాంట్రాక్టర్ చేతికి చిక్కగానే శివ్ అండ్ గ్యాంగ్‌ను లేపేయాలనే ప్లాన్‌తో వస్తాడు రామ్‌శంకర్ తివారి కొడుకు. అయితే ఆ ప్లాన్ రివర్స్ అవుతుంది. డబ్బు తీసుకుని రామ్‌శంకర్ కొడుకుని, అతని అనుచరులనూ చంపేస్తాడు శివ్. కొడుకును చంపేశాడన్న కసి, కక్షతో ఉత్తరప్రదేశ్‌లో శివ్ మీద నిఘాను పెంచుతాడు రామ్‌శంకర్. అతనిని పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేయిస్తాడు.
ఎన్‌కౌంటర్..
అప్పుడడప్పుడే సెల్ ఫోన్ల ఎంట్రీ. శివ్ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది. పట్నాకు వెళ్తూ లక్నోలో ఆగుతాడు. స్టార్ హోటల్‌లో బస కోసం వెళితే రిసెప్షనిస్ట్ నచ్చుతుంది. ఆమె పేరు బబితా శర్మ (ఆహనా కుమ్రా). ఇంట్లో సంబంధాలు చూస్తుంటే ఇంటర్‌కాస్ట్ అండ్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్లోంచి వచ్చేస్తుంది. ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుకుంటూంటారు. వీళ్ల సంభాషణను స్పెషల్ టాస్క్ ఫోర్స్ ట్యాప్ చేస్తూ ఉంటుంది శివ్‌ను పట్టుకోవడానికి. శివ్ అండర్‌వరల్డ్ చర్యలు పట్నాకూ పాకి.. అక్కడా పోలీసుల థ్రెట్ ఉండడంతో పట్నాలో ఆశ్రయం ఇస్తానన్న చంద్రభాన్ ఇంకోచోట తాత్కాలిక బస ఏర్పాటు చేస్తాడు. ఈలోపు చెల్లి పెళ్లి ఉంటుంది. వెళ్లాలనుకుంటాడు శివ్. వెళితే చంపేస్తారని అనుచరులు వారిస్తారు. ఇంకోవైపు లక్నో నుంచి ఘజియాబాద్‌కు మకాం మార్చమని బబితాకు చెప్తాడు. పట్నాకు తనతోపాటు ఆమెనూ తీసుకెళ్లాలనుకుంటాడు. ఇటు పోలీసులు బబితా అడ్రస్ ట్రేస్ చేస్తారు. చెల్లి పెళ్లికి వెళ్లాలా? ప్రియురాలి దగ్గరకు వెళ్లాలా అనే డైలమాతోనే ఉన్న చోటునుంచి బయలుదేరుతాడు శివ్. వాళ్ల సంభాషణను బట్టి అతను కచ్చితంగా ఆమె దగ్గరకే వెళ్తాడు అన్న నమ్మకంతో పోలీసులు బబితా ఇంటి ముందు పహారా కాస్తుంటారు మఫ్టీలో. చెల్లితో ఒకసారి మాట్లాడాలనుకుని ఇంటికి ఫోన్ చేస్తాడు శివ్. తండ్రి ఫోన్ ఎత్తుతాడు. మాట్లాడుతాడు. మాటల్లో కొడుకులో ఉన్న బాధ బయటపడుతుంది. తండ్రీ చలిస్తాడు. చెల్లికి విషెస్ తెలుపమంటాడు శివ్. ‘‘టైమ్ చిక్కినప్పుడు ఇంటికి రా’’ అంటూ ఫోన్ పెట్టేస్తాడు తండ్రి.
చిన్నప్పటి జ్ఞాపకాలు వెంటాడుతాయి శివ్‌ని. పశ్చాత్తాపం మొదలవుతుంది. బబితను తీసుకొని నేపాల్ వెళ్లిపోయి ప్రశాంతంగా బతకాలనుకుంటా డు. ఆ సంగతే ఆమెకు ఫోన్‌లో చెప్పి బయలుదేరుతాడు. తమ అంచనా తప్పుకాలేదు అనుకుంటూ.. కారు దిగి బబితా ఫ్లాట్‌లోకి వెళ్లబోతున్న శివ్‌ను అనుసరిస్తారు పోలీసులు. అనుమానం వస్తుంది శివ్ అండ్ గ్యాంగ్‌కి. తూటాల యుద్ధం మొదలువుతుంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ (రణ్‌వీర్ శౌరీ) చేతిలో శివ్ ప్రకాశ్ శుక్లా చనిపోతాడు. కొంత కల్పితాన్ని జోడించిన నిజం ఇది. 25 ఏళ్లకే డాన్ అయిన ఓ విద్యార్థి జీవితం. యూపీలో మొట్టమొదటిసారి ఏకే 47ను వాడింది అతనే. 20 మందిని దారుణంగా చంపాడు. అప్పుడప్పుడే ప్రైవేట్ చానళ్ల జోరు, క్రైమ్ కహానీల హోరు షురూ అయింది. శివ్‌ను పట్టుకోవడానికి ఓ ప్రైవేట్ చానల్‌లో శివ్ మీద క్రైమ్‌స్టోరీనీ షూట్ చేయించారు స్పెషల్ టాస్క్ పోలీసులు. అయినా పట్టుకోలేకపోతారు. చివరకు అలా ఎన్‌కౌంటర్ అవుతాడు శివ్. 100 మంది రాజకీయ నేతలతో అతనికి సంబంధాలున్నట్లు, వాళ్లందరికీ అతను పనిచేసిపెట్టినట్లూ శివ్ డైరీ వెల్లడించింది. వెబ్‌సిరీస్ అంటేనే సెన్సార్ లేకుండా బోల్డ్‌గా, కుటుంబ సమేతంగా చూడ్డానికి వీల్లేనివి అన్న అభిప్రాయం ఉంది. సత్యమే. కాని రంగ్‌బాజ్ దానికి విరుద్ధం.
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment