'ఎన్నిసార్లు చెప్పాలి.. మేము ఫ్రెండ్సేనని'
ముంబయి: తాను.. ఆదిత్య అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ మంచి స్నేహితులుగానే ఉంటామని ఆష్కి-2 చిత్ర బాలీవుడ్ తార శ్రద్దాకపూర్ అంటోంది. ఆష్కి-2 చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు ఆదిత్యతో మరీ చనువుగా ఉంటోందని ఆ చిత్రంలో మాదిరిగానే వారిద్దరి నిజ జీవితంలో కూడా కెమిస్ట్రీ బాగా కుదిరి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే.
ఆ వదంతులే మరికాస్త ముందుకెళ్లి వారిద్దరిప్పుడు ప్రేమలో ఉన్నారని, డేటింగ్ కూడా చేస్తున్నారని రకరకాలు మీడియాలో వార్తలు పొక్కుతున్నాయి. ఇదే విషయంపై ప్రశ్నించిన మీడియాతో కాస్తంత చిర్రుబుర్రుగా మాట్లాడారు. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను అదే విషయం మళ్లీ మళ్లీ చెప్తున్నాను. మేమెప్పుడు మంచి స్నేహితులమే. ఈ స్నేహాన్ని ఎప్పటికీ కొనసాగిస్తాం. ఆష్కి-2 చిత్రం మాకు ఒక ప్రత్యేక అనుభవం అయితే మా ఇద్దరికే ఆ అనుభవం కాదు. దర్శకుడు మోహిత్ సూరి కూడా మాతో ఉన్నారు' అని చెప్పింది ఆ అమ్మడు.