
తప్పు ఎవరిది?
వంశీ సినిమా ‘సరదాగా కాసేపు’ కథానాయిక మధురిమ గుర్తుంది కదూ! తను తాజాగా ‘సేందు పోలామ్’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్ర దర్శక నిర్మాతలకు మధురిమకు మధ్య యుద్ధం నడుస్తోంది. ఆ కథ ఏంటంటే.. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించి న్యూజి ల్యాండ్‌లో 50 రోజుల పాటు భారీ షెడ్యూల్ చేశారు. ఈ షెడ్యూల్‌లో మధురిమ సకాలంలో షూటింగ్‌కి హాజరు కాకపోవడంతో ఇబ్బందులపాలయ్యామని దర్శకుడు అనిల్ కుమార్, నిర్మాత శశి ఆరోపిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు షూటింగ్ అంటే, ఆ సమయానికి రాకుండా తన ఇష్టం వచ్చినట్లు మధురిమ వచ్చేదని అనిల్ వాపోతున్నారు. న్యూజిల్యాండ్‌లో ఓ అధునాతన కెమెరాని అద్దెకి తీసుకున్నామని, అక్కడి టెక్నీషియన్‌ని నియమించుకున్నామని అనిల్ అన్నారు. అయితే, మధురిమ
సహకరించకపోవడంవల్ల అనుకున్న రోజుల్లో పూర్తి చేయలేకపోయామని చెప్పారు.
మధురిమ కథనం వేరేలా ఉంది. తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా షూటింగ్స్‌కి వెళ్లనని, కానీ, వీసా వ్యవహారాలు చూసే వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన తల్లి న్యూజిల్యాండ్‌కి రాలేకపోయారని మధురిమ అన్నారు. ఒంటరిగా వెళ్లిన తనకు పర్సనల్ అసిస్టెంట్‌ని కూడా సమకూర్చలేదని, తన పారితోషికంలో పది శాతం అడ్వాన్స్ అయినా ఇవ్వలేదని మధురిమ తెలిపారు. ఈ చిత్రం కారణంగా తను కమిట్ అయిన వేరే చిత్రాలకు ఇబ్బంది ఏర్పడిందని, 90 శాతం సినిమా పూర్తయినా పారితోషికం గురించి మాట్లాడకపోవడంతో, ప్రశ్నించానని ఆమె పేర్కొన్నారు. పారితోషికం గురించి అడిగినందుకే తనను ‘క్రిమినల్’లా చిత్రిస్తున్నారని కూడా వాపోయారు. అనిల్ మాటలు వింటే అతనిదే కరెక్ట్ అనిపిస్తుంది. మధురిమ మాటలు వింటే తన వైపే న్యాయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరి.. తప్పెవరిదో?