అమలాపాల్ ఎందుకు నటిస్తోందంటే..
నటి అమలాపాల్ నటనను ఎందుకు కొనసాగిస్తున్నారన్న ప్రశ్న పరిశ్రమలోని చాలా మంది మదిలో మెదులుతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం లేక పోలేదు. కోలీవుడ్‌లో తొలి చిత్రం వీరశేఖరన్ సోయలో లేకపోయినా, మలి చిత్రం సింధు సమ వెలితో సంచలన నటిగాను, మూడో చిత్రం మైనాతో విజయవంతమైన నటిగా పేరు తెచ్చుకున్న నటి అమలాపాల్. అంతకు ముందు, ఆ తర్వాత కూడా కొన్ని మలయాళ చిత్రాల్లో నటించి మాతృభాషలోను తన పేరును సుస్థిరం చేసుకున్న ఈ కేరళ కుట్టి బెజవాడ, నాయక్, ఇద్దరు అమ్మాయిలు తదితర చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు.
ఇలా చాలా తక్కువ కాలంలోనే దక్షిణాది సినీ పరిశ్రమలో అందరి మనస్సు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ అనూహ్యంగా పెళ్లి పీటలు ఎక్కారు. వివాహ అనంతరం నటనకు స్వస్థి పలుకుతున్నట్టు తొలుత ప్రకటించారు. ఇది ఆమె అభిమానుల్లోనే కాదు. చిత్ర పరిశ్రమ వర్గాల్లోనూ ఊహించని అంశం. అమలాపాల్ పెళ్లితో, ఆమెతో చిత్రాలు నిర్మిద్దామన్న దర్శక నిర్మాతలు ఆ ప్రయత్నాల్ని విరమించుకున్నారు. అలాంటి వారిలో దర్శకుడు సముద్రఖని కూడా ఉన్నారు. ఆయన అమలాపాల్ ద్విపాత్రాభినయంతో కిట్నా అనే చిత్రాన్ని రూపొందించేందుకు సంకల్పించారు. ఆమె పెళ్లితో ఆచిత్ర నిర్మాణం ఆగింది.
అలాంటి అమలాపాల్ వివాహ అనంతరం మళ్లీ నటించడంలో కారణం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు చాలా మంది మదిలో నెలకొంది. అమలాపాల్ నటించేందుకు గల కారణాన్ని ఆమె భర్త, దర్శకుడు విజయ్ తెలుపుతూ హైకూ చిత్రం మినహా ఆమె నటిస్తున్న చిత్రాలను వివాహానికి ముందే అంగీకరించినట్టు పేర్కొన్నారు. ఇక, హైకూ చిత్రంలో నటించేందుకు కారణం ఆ చిత్ర దర్శకుడు తన మిత్రుడు పాండిరాజ్ , నటుడు సూర్య అని తెలిపారు.