
'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు?
అంచనాలను మించి రికార్డులు తిరగరాసిన 'బాహుబలి'పై ఆసక్తి కొనసాగుతూనే ఉంది.
విడుదలై రెండు వారాలు గడిచినా 'బాహుబలి' ఫీవర్ జనాన్ని వదిలిపోలేదు. అంచనాలను మించి రికార్డులు తిరగరాసిన 'బాహుబలి'పై ఆసక్తి కొనసాగుతూనే ఉంది. రెండో భాగంపై అప్పుడే చర్చలు, రూమర్లు, జోకులు పేలుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే జోకులే జోకులు. ఒకే ఒక ప్రశ్న చుట్టూ నెటిజన్లు హాస్యం పుట్టిస్తున్నారు. 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'క్వశ్చన్ ఆఫ్ ది ఇయర్'గా తేల్చేసి దీనికి సమాధానంగా సంధించిన సరదా కామెంట్లు, ఫోటోలతో కేక పెట్టిస్తున్నారు.
'బాహుబలిని కటప్ప ఎందుకు చంపాడో దేశం తెలుసుకోవాలనుకుంటోంద'ని ఒకరంటే... బాహుబలి చిన్నప్పుడు కటప్ప భోజనం ప్లేటు లాక్కున్నందుకే ఇలా చేశాడని మరొకరు సరదాగా కామెంట్ చేశారు. పనిలో పనిగా ఫోటో కూడా పోస్ట్ చేశారు. 'మిర్చి' సినిమాలో సత్యరాజ్ భార్య మరణానికి ప్రభాస్ కారకుడయ్యాడనే పగతో 'బాహుబలి'ని కట్టప్ప కడతేర్చాడని మరొకరు వెరైటీ భాష్యం చెప్పారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో పెద్దోడు, చిన్నోడు మధ్య సంభాషణల్లో 'బాహుబలి'ని చొప్పించి వినోదం పంచారు.
కొంతమంది తుంటరులైతే తమ సందేహం తీర్చుకోవడానికి ఏకంగా కస్టమర్ కేర్ కు ఫోన్ చేశారు. ఆ సంభాషణ సాగిందిలా...
కస్టమర్ కేర్ ఉద్యోగి: మీకు నేను ఎలా సహాయ పడగలను
తుంటరి: సర్, నేను ఓ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను
కస్టమర్ కేర్ ఉద్యోగి: అలాగే, అడగండి
తుంటరి: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?
ఇది తెలుసుకునేందుకు కస్టమర్ కేర్ ఉద్యోగి వెంటనే తన ఉద్యోగాన్ని వదిలేసి 'బాహుబలి' సినిమా చూడడానికి వెళ్లాడు.