
ప్రెగ్నెంట్ అయితే..భయపడాలా?
‘ఐయామ్ ప్రెగ్నెంట్, నాట్ ఎ కార్ప్స్ (శవాన్ని కాదు). దర్శక- నిర్మాతలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. సినిమాల్లో నటించమంటూ నన్ను సంప్రదించవచ్చు. ప్రెగ్నెన్సీ నటనకు అడ్డు కాదు’’ అన్నారు కరీనా కపూర్. సైఫ్ ముద్దుల సతీమణి ఇంత ఘాటుగా స్పందించడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ‘గోల్‌మాల్ 4’లో కథానాయికగా కరీనా నటిస్తారా? మరొకర్ని తీసుకుంటారా? అని దర్శకుడు రోహిత్ శెట్టిని ప్రశ్నించగా, ‘‘కరీనాని అడిగితే ఓకే అంటుంది.
కానీ, నేనా పని చేయలేను. (గర్భవతి అనే అంశం గుర్తు చేస్తూ) ‘గోల్‌మాల్ 4’ గురించి తనతో మాట్లాడాలంటే భయంగా ఉంది’’ అన్నారు. రోహిత్ వ్యాఖ్యలను ఉద్దేశించేనా.. మీరు పై వ్యాఖ్యలు చేసారనే ప్రశ్న కరీనా ముందుంచితే, ‘‘ప్రెగ్నెంట్ ఆర్ నాట్, నా కోసం ఓ పాత్ర ఉంటే నా దగ్గరకు వస్తారు. అందులో తప్పేముంది? అతనెందుకు భయపడడం? నేనే అతణ్ణి చూసి భయపడాలి’’ అని కరీనా వ్యాఖ్యానించారు.
‘గోల్‌మాల్ 4’లో కరీనా కపూర్ ప్రత్యేక గీతంలో నటించే అవకాశం ఉందని రోహిత్ శెట్టి అంటున్నారనే విషయాన్ని గుర్తు చేస్తే, అది జరగదని కరీనా కపూర్ స్పష్టం చేశారు. ఐటమ్ సాంగ్‌కి శ్రమ ఎక్కువ కాబట్టి అలా అని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.