
పూరి దర్శకత్వంలో చిరంజీవి 150వ చిత్రం
ఆటోజానీ
2015, మే 9.... మెగాస్టార్ చిరంజీవికి మోస్ట్ మెమరబుల్ డే. సరిగ్గా పాతికేళ్ల క్రితం ఇదే రోజున విడుదలైన ‘జగదేకవీరుడు- అతిలోక సుందరి’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల కుంభవృష్టి కురిపించింది. చిరంజీవి టాప్‌టెన్ చిత్రాల్లో కచ్చితంగా నిలిచే సినిమా ఇది. ఆ చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత సి.అశ్వనీదత్‌లను శనివారం తన ఇంటికి పిలిచి నూతన వస్త్రాలతో సత్కరించి ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ నాటి జ్ఞాపకాలను తలచుకున్నారు చిరంజీవి.
ఈ హడావిడి అంతా అయిపోయాక, రాత్రి పూట చిరంజీవిని పూరి జగన్నాథ్ కలిశారు. చిరంజీవి 150వ సినిమా కోసం పూరి కథ చెప్పడం మొదలుపెట్టారు. చిరంజీవి స్పెల్ బౌండ్ . వెంటనే లేచి పూరిని హగ్ చేసుకుని, ‘‘నా 150వ చిత్రానికి నువ్వే దర్శకుడివి’’ అని చెప్పేశారు. దాంతో కొన్నేళ్లుగా చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించిన నిరీక్షణకు తెరపడి నట్టే. ‘శంకర్‌దాదా జిందాబాద్’ తర్వాత చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయడం, దాంతో ఏడేళ్లు వెండితెరకు దూరం కావడం తెలిసిందే.
గతేడాది కాలంగా చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాలామంది చిరంజీవికి కథలు వినిపించారు కూడా. అయితే తన రీ ఎంట్రీ, దానికి తోడు 150వ సినిమా కావడంతో చిరంజీవి కథ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. రెండు నెలల క్రితం చిరంజీవి కోసం ‘ఆటో జానీ’ పేరుతో కథ తయారు చేస్తున్నట్టు పూరి వెల్లడించారు. ఫైనల్‌గా మొన్న శనివారం రాత్రి చిరంజీవికి పూరి కథ చెప్పి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని సమాచారం.
చిరంజీవి ఎక్స్‌ట్రార్డినరీగా కామెడీ పండిస్తారు. ఈ కోణంలో పూరి ఎక్కువ దృష్టి పెట్టి ఈ స్క్రిప్టు తయారు చేశారని వినికిడి. చిరంజీవి వీరాభిమాని అయిన పూరి జగన్నాథ్‌కు ఎప్పటినుంచో తన అభిమాన కథానాయకునితో సినిమా చేయాలని ఆకాంక్ష. గతంలో ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇన్నేళ్లకు పూరి కల నెరవేరనుంది. ఈ ‘ఆటో జానీ’ చిత్రానికి రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. సెప్టెంబరులో చిత్రీకరణ మొద లుపెట్టి 2016 సంక్రాంతికి ‘ఆటో జానీ’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లాలనేది పూరి సంకల్పం. పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడవుతాయి.