'కత్తి' కథ గొడవ ముగిసింది
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కుతున్న కత్తిలాంటోడు, కథ విషయంలో చాలా రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా కత్తి. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే తెలుగు రచయిత ఎన్ నరసింహారావు, ఈ కథ నాదంటూ పోరాటం చేశాడు. అయితే అప్పట్లో ఆయన పోరాటం ఫలించలేదు.
తరువాత చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా కత్తి సినిమాను రీమేక్ చేస్తున్నట్టుగా వార్తలు రావటంతో నరసింహారావు మరోసారి తన పోరాటాన్ని ప్రారంభించాడు. కత్తి సినిమా విడుదలకు ముందే తన కథను తెలుగు సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించినట్టుగా ఆధారాలు చూపించాడు. ఈ ఆధారాలను పరిశీలించిన సీనియర్ దర్శకులు దాసరి నారాయణరావు అతడికి న్యాయం జరిగే వరకు చిరు సినిమా షూటింగ్కు కార్మికులు హాజరు కావద్దని తెలిపారు. దీంతో కొంత కాలంగా నరసింహారావుతో మెగా టీం సంప్రదింపులు జరుగుతోంది.
ఫైనల్గా చర్చలు ఓ కొలిక్కి వచ్చాయన్న వార్త వినిపిస్తోంది. ఎన్ నరసింహారావు పేరును సినిమా టైటిల్స్లో కథాసహకారం అంటూ వేస్తాం అన్న హామితో పాటు 40 లక్షల రూపాయిల పారితోషికం కూడా ఇచ్చేందుకు కత్తిలాంటోడు సినిమా యూనిట్ అంగకీరించింది. యూనిట్ సభ్యులు చెప్పిన హామిలతో సంతృప్తి చెందిన నరసింహారావు. ఇక వివాదం ముగినట్టే అని ప్రకటించారు.